అనకాపల్లి – ఆనందపురం జాతీయ రహదారి లో నిర్మించనున్న 12 మినీ ఫ్లై ఓవర్ల మ్యాప్
సాక్షి, అమరావతి: విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. విశాఖ నగరాన్ని దశాబ్దాలుగా వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యలకు త్వరలో ముగింపు పలకనుంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరం గుండా ఆనందపురం వరకు జాతీయ రహదారిపై 12 మినీ ఫ్లై ఓవర్లు నిర్మించడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సంసిద్ధమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ‘వన్‌టైం ఇన్‌వెస్ట్‌మెంట్‌స్కీం’ కింద ఈ మినీ ఫ్లై ఓవర్లను మంజూరు చేసింది. కేవలం 67 కి.మీ.పరిధిలోనే 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం విశేషం. విశాఖ, గంగవరం పోర్టులు, విశాఖ విమానాశ్రయంతోపాటు త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారుల జంక్షన్లలో ఈ మినీ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు.
అందుకోసం రూ.350 కోట్ల అంచనాతో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ 12 జంక్షన్ల భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి 3 డిజైన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించనుంది.
నాలుగు రోడ్ల జంక్షన్ అయితే ప్లస్ (+), మూడు రోడ్ల కూడలి అయితే వై (Y), రెండు రోడ్ల కూడలి అయితే టీ (T) ఆకృతిలో వాటిని ని ర్మించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రదేశాల్లో అండర్ పాస్‌లు నిర్మిస్తారు.
భవిష్యత్‌లో విశాఖ మెట్రో రైల్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐను కోరింది. 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి డీపీఆర్‌లను 2023 జనవరి చివరినాటికి ఖరారు చేసి ఆమోదించాలని భావిస్తున్నట్లుగా ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. మార్చి–ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని భావిస్తోంది.
మినీ ఫ్లై ఓవర్లు నిర్మించే జంక్షన్లు ఇవే..
లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, డెయిరీ ఫాం,తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార, సీతమ్మధార, మద్దిలపాలెం, ఎండాడ, మధురవాడ.
Comments
Please login to add a commentAdd a comment