పోలీస్‌ పహారా కాస్తేనే.. ఎక్స్‌ప్రెస్‌వే పనులు | Locals are blocking the road works | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పహారా కాస్తేనే.. ఎక్స్‌ప్రెస్‌వే పనులు

Published Thu, Jul 18 2024 4:20 AM | Last Updated on Thu, Jul 18 2024 5:11 PM

Locals are blocking the road works

భద్రత కల్పిస్తేనే ఖమ్మం – దేవరపల్లి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు పనులు సాగుతాయి 

సీఎంకు ఎన్‌హెచ్‌ఐఏ ఉన్నతాధికారుల వినతి 

ఖమ్మం శివారులో రెండు వంతెనలు సహా రోడ్డు పనులు అడ్డుకుంటున్న స్థానికులు 

భూముల ధరలు పెంచుకునేందుకు కొదుమూరు వద్ద సర్వీసు రోడ్డు కోసం డిమాండ్‌ 

ఏడాదిన్నరగా ఆ రెండు చోట్ల మొదలుకాని పనులు 

అదో ఎక్స్‌ప్రెస్‌ వే.. పూర్తి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే.. మరో ఆరేడునెలల్లో నాలుగు వరసల ఆ రోడ్డు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రెండు కీలక ప్రాంతాల్లో పని మొదలు కాలేదు, ఏడాదిన్నరగా అలాగే ఉండిపోయింది.. ఇప్పుడు ఆ రోడ్డు పనులు పూర్తి కావాలంటే పోలీసు పహారా అవసరం ఏర్పడింది. స్వయంగా ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రిని భద్రత కోరాల్సి వచ్చింది. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4 గంటల మేర తగ్గించే కీలక రోడ్డుకు ఇప్పుడు పోలీసు భద్రత అవసరం పడింది. మిగతాచోట్ల పనులు దాదాపు పూర్తి కాగా, రెండు కీలక ప్రాంతాల్లో స్థానికులతో పేచీ ఏర్పడింది. ఒకచోట అయితే, పలుకుబడి కలిగిన ఓ వ్యక్తే పనిని అడ్డుకున్నాడు. 

ఏడాదిన్నరగా ఇదే సమస్య. దీంతో ఈ పనిని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు కోరాల్సి వచ్చింది. పోలీసు భద్రత కల్పిస్తే పనులు చేస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి విన్నవించారు. 

∙హైదరాబాద్‌–విశాఖపట్నం జాతీయ రహదారి లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మూ డేళ్ల క్రితం ఎన్‌హెచ్‌ఏఐ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఖమ్మం పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు కొత్త యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రతిపాదించింది. 162. 12 కి.మీ. నిడివి ఉండే ఈ నాలుగు వరసల రోడ్డు నిర్మాణాన్ని రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. రోడ్డు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే మార్చి నాటికి ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, ఖమ్మం పట్టణం శివారులోని ధ్వంసలాపురం, చింతకాని మండలంలోని కొదుమూరు వద్ద అసలు పనులే ప్రారంభం కాలేదు. 

సమస్య ఏమిటంటే.. 
ఖమ్మం శివారులోని ధ్వంసలాపురం వద్ద ఈ రోడ్డుకు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం–బోనకల్‌ రోడ్డు, ౖరైల్వే లైన్, మున్నేరు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ ఓవైపు మున్నేరు మీద 100 మీట ర్ల నిడివి వంతెన, మరోవైపు 150 మీటర్ల పొడవైన రైల్‌ ఓవర్‌బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఈ 2 వంతెనల నిర్మాణం నేపథ్యంలో, ధ్వంసలాపురం వద్ద ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌వే ఎత్తు ఏకంగా 14 మీటర్లుగా ఉంటుంది. అక్కడ పట్టణంలోకి వెళ్లేందుకు, పట్ట ణంలోని వాహనాలు ఈ రోడ్డు మీదకు వచ్చేందు కు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

కానీ, అంత ఎత్తుండే రోడ్డు నుంచి ఈ అనుసంధానం కావాలంటే కిలోమీటరున్నర స్థలం అవసరం. కానీ అక్కడ కేవలం 350 మీటర్ల నిడివి మాత్రమే ఉ న్నందున అది సాధ్యం కాదని ఎన్‌హెచ్‌ఐఏ తేల్చే సింది. దీంతో స్థానికులు ఆ రెండు వంతెనల నిర్మా ణాన్ని ప్రారంభం కాకుండా అడ్డుకుంటూ వస్తున్నా రు. ఇక.. చింతకాని మండలం కొదుమూరు వద్ద సర్వీసు రోడ్డు నిర్మించాలని కొందరు అడ్డుకుంటున్నారు. యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు సర్వీసు రోడ్డు నిర్మించరు.

అండర్‌పాస్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, సర్వీసు రోడ్డు నిర్మిస్తే తమ భూము ల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఒకరిద్దరు స్థానికులను రెచ్చగొడుతున్నారు. సర్వీసు రోడ్డు నిర్మిస్తే దాని వెంబడి నిర్మాణాలు, వాణిజ్య కట్టడాలు వెలిసి ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనం నెరవేరద న్నది అధికారుల మాట. ఇలా ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాంతల్లో అసలు పనులే మొదలు కాలేదు. 

ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ పరిశీలన 
పోలీసు బలగాలను కేటాయిస్తే ఆ రెండు చోట్ల పనులు నిర్వహిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంటోంది. ఈ రెండు అడ్డంకుల వల్ల హైదరాబాద్‌– విశాఖపట్నం మధ్య ప్రయా ణ సమయాన్ని తగ్గించాలన్న ప్రయత్నానికే విఘాతం కలిగిందని తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన ఎన్‌హెచ్‌ఐఏ ఢిల్లీ అధికారులు ఈ మేరకు సహకరించాలని కోరారు. ఈ రోడ్డు పనులకు పోలీసు భద్రత క ల్పించటమా, స్థానికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని మధ్యే మార్గంగా మార్పులు చేయటమా అన్న విషయాన్ని ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement