సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్‌ఎల్‌కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
రోడ్ల నిండా వాహనాలే..
ఐఆర్‌ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్‌పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్‌లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎక్కడ చేయాలంటే..
రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్‌ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్‌ను నిర్మించి రేసింగ్‌లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు.
చైనా, చెన్నైలలో ఎలాగంటే..
చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్‌లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్‌లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు.
పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది
ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్‌కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్‌లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం.
దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్‌డౌన్‌కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి.
నరకప్రాయంగా మారుతోంది..
సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది.
– రామ్, ప్రైవేటు ఉద్యోగి
వైఫల్యానికి నిదర్శనం..
తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
– ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్‌వేర్
రెట్టింపు సమయం..
సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్‌నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి
జనాల్ని బాధపెట్టే పోటీలు..
ఇండియన్ రేసింగ్ లీగ్‌తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి?
– వంగీపురం రాఘవ, నాగారం
Comments
Please login to add a commentAdd a comment