సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్– టివోలి జంక్షన్–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్‌పీరోడ్-ఎస్పీ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ నేపథ్యంలో పలు జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) – గ్రీన్‌లాండ్స్–ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా–సీటీ–ప్లాజా–ఎస్‌బీహెచ్–వైఎంసీఏ–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్‌రోడ్–ఆలుగడ్డ బావి–మెట్టుగూడ– చిలకలగూడ–బ్రూక్ బాండ్–టివోలి–బాలమ్రాయ్–స్వీకర్ ఉపకార్–సికింద్రాబాద్ క్లబ్–తిరుమలగిరి–తాడ్‌బండ్–సెంట్రల్ పాయింట్ మార్గాల్లో ప్రయాణించొద్దని సూచించారు.
టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్‌బీఎస్ క్రాస్‌రోడ్‌ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ప్రవేశాలను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు.
సాధారణ ప్రయాణికులు, వాహనాలు చిలకలగూడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాలని చెప్పారు. సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్ జంక్షన్-రేతిఫైల్ టీ జంక్షన్-చిలకలగూడ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, ప్రయాణికులు క్లాక్ టవర్-పాస్‌పోర్ట్ ఆఫీస్-రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని పర్యటన ఇలా
శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment