Indian Racing League
-
హైదరాబాద్ నుంచి రేసింగ్ పోటీలు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా నగరంలో జరగాల్సిన రెండు రేసింగ్ పోటీలు రద్దయ్యాయి. ఈ నెల 4, 5 తేదీల్లో నెక్లెస్ రోడ్ వేదికగా ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ నిబంధనలతో వీటిని ఇక్కడ జరపడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండు రేస్‌లను హైదరాబాద్‌నుంచి తరలిస్తున్నామని, ప్రకటించిన ఆ రెండు తేదీల్లోనే చెన్నైలో నిర్వహిస్తామని వారు వెల్లడించారు. రేస్‌ల కోసం ఇప్పటికే టికెట్లు కొన్నవారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలకు నగరం మరోసారి ఆతిథ్యమివ్వనుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ అనంతరం వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా– ఈ పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఇండియన్ మోటార్ రేసింగ్ లీగ్ కోసం హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్‌రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గతంలో కార్ రేసింగ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లు, బారికేడ్లు, ఎత్తైన కంచెలను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేసి నవంబర్ నాటికి రేసింగ్ నిర్వహణకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే ట్రాక్‌పై ఫిబ్రవరి 10న ఫార్ములా–ఈ పోటీలు జరుగుతాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ట్రాక్ పునరుద్ధరణ చేపట్టారు. -
మోటార్ స్పోర్ట్ టీమ్ యజమానిగా నాగ చైతన్య
సాక్షి, హైదరాబాద్: మోటార్ స్పోర్ట్ రేసింగ్‌లో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య భాగమయ్యాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో ఒక జట్టయిన ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’ను అతను కొనుగోలు చేశాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ గత సీజన్లో నాలుగు రేస్‌లు గెలిచిన ఈ టీమ్ త్వరలో తొలిసారి నిర్వహించనున్న ‘ ఎఫ్ఐఏ ఫార్ములా–4 ఇండియన్ చాంపియన్‌షిప్’లో కూడా పాల్గొనబోతోంది. 2022 సీజన్లో బ్లాక్‌బర్డ్స్ జట్టుకే చెందిన అఖిల్ రవీంద్ర డ్రైవర్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. టీమ్ చాంపియన్íÙప్లో బ్లాక్ బర్డ్స్‌కు రెండో స్థానం దక్కింది. అఖిల్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన నీల్ జానీ ఈ టీమ్‌లో మరో డ్రైవర్‌గా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మోటార్ రేసింగ్‌ను ఎంతో ఇష్టపడే తాను ఇప్పుడు టీమ్ యజమానిగా రేసింగ్ బృందంలో భాగం కావడం సంతోషంగా ఉందని నాగచైతన్య వ్యాఖ్యానించాడు. -
హైదరాబాద్: ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్ ( ఫొటోలు)
-
Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ విజేత అఖిల్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టుకు చెందిన అఖిల్ రవీంద్ర డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. మొత్తం ఆరు జట్లు పోటీపడిన ఈ లీగ్ ఆదివారం ముగిసింది. ఈ లీగ్‌లో అఖిల్ మొత్తం 147 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గాడ్స్పీడ్ కొచ్చి జట్టుకు చెందిన అలిస్టర్ యూంగ్ (142 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. ట్యాంక్‌బండ్ రోడ్‌లోని హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో ఆదివారం జరిగిన రేసుల్లో అలిస్టర్ యూంగ్, నిఖిల్ బోరా విజేతలుగా నిలిచారు. 445.5 పాయింట్లతో గాడ్స్పీడ్ కొచ్చి జట్టు టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... 397 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రన్నరప్‌గా నిలిచింది. -
Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్‌ఎల్‌కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్ల నిండా వాహనాలే.. ఐఆర్ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్‌పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్‌లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చేయాలంటే.. రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్‌ను నిర్మించి రేసింగ్‌లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చైనా, చెన్నైలలో ఎలాగంటే.. చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్‌లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు. పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్‌కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్‌డౌన్‌కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి. నరకప్రాయంగా మారుతోంది.. సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది. – రామ్, ప్రైవేటు ఉద్యోగి వైఫల్యానికి నిదర్శనం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్వేర్ రెట్టింపు సమయం.. సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్‌నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి జనాల్ని బాధపెట్టే పోటీలు.. ఇండియన్ రేసింగ్ లీగ్‌తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి? – వంగీపురం రాఘవ, నాగారం -
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి (ఫొటోలు)
-
మళ్లీ గందరగోళం.. తొలి రోజు ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
నగరంలో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలిరోజు ముగిసింది. అయితే తొలిరోజు రేసింగ్‌లో రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి. రేసింగ్ నిర్వహణలో మరోసారి గందరగోళం నెలకొనడంతో నిర్వహకులు ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో ఉన్నారు. రేసింగ్ సమయంలో రెండు కార్లు రేస్ మద్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. గతంలోలాగే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం కావడంతో ప్రాక్టీస్ రేస్‌లతోనే నిర్వాహకులు తొలిరోజును ముగించారు. ఆలస్యం కారణంగా మెయిర్ రేస్-1 జరగలేదు. దీంతో ఆదివారం అసలైన ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఇక సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. అయితే రేసింగ్ చూడడానికి వీక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది. -
హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి
హైదరాబాద్‌లో మరోసారి కార్ రేసింగ్ సందడి షురూ అయింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ జరుగుతుంది. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై కార్లు రయ్.. రయ్‌మని దూసుకెళ్లాయి. కాగా రేసింగ్‌లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు.గంటకు 250-300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. -
Hyderabad IRL: కార్ రేసింగ్‌కు సై
సాక్షి, సిటీబ్యూరో: సాగరతీరం మరోసారి ఉత్కంఠభరితమైన కార్ రేసింగ్‌కు సన్నద్ధమైంది. గత నెలలో సాంకేతికంగా ఎలాంటి పోటీలు లేకుండానే ముగిసిన రేసింగ్‌ను ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు జరుగనున్న ఈ పోటీల కోసం రేసింగ్ కార్లు మరోసారి నగరానికి చేరుకున్నాయి. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 12 రేసింగ్ కార్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర నగరాలతో పాటు విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు. రేసింగ్ రయ్.... హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. ట్రాఫిక్ నరకం.. ఇండియన్ రేసింగ్ లీగ్ దృష్ట్యా శుక్రవారం నుంచే నెక్లెస్‌రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. మింట్ కాపౌండ్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు ఈ మార్గంలోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైన పడిగాపులు కాయాల్సి రావడంతో వాహనదారులు నరకం చవి చూశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు. అటు మహాగణపతి వైపు నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారి స్తంభించింది. లోయర్‌ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర రూట్లలోనూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. -
IRL: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్ సాగర్ ఒడ్డున మళ్లీ సందడి చేయనుంది. శనివారం, ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ ఉండనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు వర్తించనున్నాయి. గత నెలలో జరిగిన పోటీలు.. అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్‌రోడ్ మూసివేస్తారు. బుద్ధభవన్, నల్లగుట్ల జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వైపు వాహనాలకు నో ఎంట్రీ అమలు కానుంది అనుమతులు.. ► విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బుద్ధభవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు అనుమతిస్తారు. ► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. ► ట్యాంక్‌బండ్/తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మి నార్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బీఆర్కేఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు అనుమతిస్తారు. ► ఖైరతాబాద్ బడాగణేశ్ వీధి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్ వైపు అనుమతిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్‌లు ఈ నెల 9 నుంచి ఈ నెల 11 వరకు మూసి ఉంటాయి. శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరం నెక్లెస్ రోడ్డులోని 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నాయి. శనివారం 2 క్వాలిఫయింగ్ సెషన్లు, ఒక స్ప్రింట్ రేసు జరగనుంది. అలాగే ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ జరిగింది. ఆ సమయంలో.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. -
హైదరాబాద్ వేదికగా మరోసారి ఇండియా రేసింగ్ లీగ్
-
హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) నిర్వహించారు. దీంతో ఇటువైపుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కార్ రేసింగ్ ముగియడంతో సోమవారం వాహనాలను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర కొత్త సచివాలయం ముందు నుంచి అనుమతించారు. రెండురోజుల పాటు ఇబ్బందులకు గురైన వాహన చోదకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కార్ రేసింగ్ కోసం ఈ మార్గంలో ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు. దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై జట్టుకు చెందిన కారు ప్రమాదానికి గురికావడంతో రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మళ్లీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహిస్తారు. (క్లిక్ చేయండి: రేస్ లేకుండానే ముగిసిన లీగ్...) -
రేస్ లేకుండానే ముగిసిన లీగ్.. ‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్... గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో చర్చగా మారిన స్పోర్ట్స్ ఈవెంట్! శనివారమే లీగ్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌తోపాటు ఒక ప్రధాన రేసు జరగాల్సి ఉన్నా... వేర్వేరు కారణాలతో అన్నింటినీ ఆదివారానికి వాయిదా వేశారు. వీకెండ్లో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చి ‘స్ట్రీట్ సర్క్యూట్’లో రేసింగ్ పోటీలను తిలకించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన ఒక ఘటన తొలి అంచెలో మూడు రేసులను ముగించింది. అప్పటికి ఇంకా క్వాలిఫయింగ్ రేస్‌లు ప్రారంభమే కాలేదు. ప్రాక్టీస్ మాత్రమే సాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై జట్టుకు చెందిన డ్రైవర్ విష్ణు ప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. దాంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్రేక్‌ల సమస్యే ఇందుకు కారణమని తేలింది. ఎల్జీబీ ఫార్ములా 4లో పోటీపడుతున్న కార్లు ప్రాక్టీస్ సమయంలో వుల్ఫ్ జీబీ08 థండర్స్ కారు బ్రేక్‌లు ఆశించిన రీతిలో సరిగా పని చేయడం లేదని అప్పటికే డ్రైవర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో మలుపుల వద్ద హెవీ బ్రేకింగ్ జోన్లో అవి ప్రభావం చూపలేకపోయాయి. ప్రమాదం జరిగాక ఆ కారును సర్క్యూట్ నుంచి తప్పించిన నిర్వాహకులు తర్జనభర్జనల అనంతరం ప్రధాన రేస్‌లను ప్రారంభించరాదని నిర్ణయించారు.‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్ఎంఎస్సీఐ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా రేస్‌లను రద్దు చేశాం. ఘటనపై విచారణ జరిపిస్తాం’అని ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారులు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్‌లో భాగంగా తర్వాతి రెండు అంచెలు చెన్నైలో, ఆపై చివరి అంచె డిసెంబర్ 10, 11లో మళ్లీ హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. అయితే తాజా ఘటన అనంతరం వాయిదా పడిన తొలి అంచెలోని మూడు రేస్‌లను ఎప్పుడు నిర్వహిస్తారో? మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసినా వీక్షకులకు మరో రూపంలో కాస్త ఊరట లభించింది. అదే ట్రాక్‌పై ఆదివారం సమాంతరంగా జరగాల్సిన జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ (ఎల్జీబీ ఫార్ములా 4)ను మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘ఓపెన్ వీల్‘కార్లతో సాగిన మూడు రేస్‌లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. -
Hyderabad: నిలిచిపోయిన కార్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై టర్బో రైడర్స్ మహిళారేసర్కు గాయాలయ్యాయి. క్వాలి ఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. రేసింగ్ ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. ఫార్మూలా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. కాగా, శనివారం మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చదవండి: టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు? -
ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది. రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు. మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది. మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది. -
సాగర తీరంలో రయ్ రయ్.. పరుగులు తీసిన రేసింగ్ కార్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం నెక్లెస్ రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీశాయి. 60 నుంచి 80 సెకన్ల వ్యవధిలో ఒక ల్యాప్ చొప్పున పూర్తి చేశాయి. సాయంత్రం 4.18 గంటలకు మంత్రి కేటీఆర్ ట్రాక్‌ను సందర్శించి జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దాంతో రేసింగ్ కార్లు ముందుకు దూకాయి. వాయువేగంతో దూసుకెళ్లాయి. గంట పాటు పోటీలు జరిగాయి. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పోటీల కోసం 2.3 కిలోమీటర్ల ట్రాక్నే వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌లో 17 మలుపుల నుంచి 200 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీశాయి. ఈ పోటీలను వీక్షించేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. పిల్లలు, పెద్దలతో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడిగా కనిపించింది. మరోవైపు పోటీల నిర్వహణ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు, భద్రతా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను తిలకించేందుకు కేటీఆర్ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఆరు బృందాలు.. 12 కార్లు.. పోటీల్లో ఆరు బృందాలు పాల్గొన్నాయి. 12 రేసింగ్ కార్లను వినియోగించారు. హైదరాబాద్ బర్డ్స్ టీమ్‌లో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి, అఖిల్ రవీంద్ర, స్వీడన్ రేసర్ నీల్జానీ, ఫ్రెంచ్ రేసర్ లోలా లోవిన్సాస్లు ఉన్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు క్వాలిఫయింగ్తో పాటు ఒక ప్రధాన రేస్ జరగాల్సి ఉన్నా.. కొత్త ట్రాక్ కావడంతో రేసర్లు ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఆదివారం అన్ని రేసులూ జరగనున్నాయి. కుంగిన గ్యాలరీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కొద్దిగా కిందకు కుంగింది. మంత్రి కేటీఆర్ రావడంతో ఆయనతో పాటు చాలా మంది పైకి వచ్చారు. దీంతో గ్యాలరీ సామర్థ్యం కంటే ఎక్కువ మంది చేరడంతో ఒక వైపు బరువు పెరిగి గ్యాలరీ కుంగింది. అప్రమత్తమైన పోలీసులు కొంతమందిని కిందకు దింపారు. విరిగిపడిన చెట్టు కొమ్మ మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాలరీలు వెలవెల వేలాది మంది ప్రేక్షకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం తక్కువగానే కనిపించింది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి. చాలా మంది నెక్లెస్‌రోడ్డు, మింట్‌కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో ట్రాక్ బయట నించొని పోటీలను వీక్షించారు. హైదరాబాద్ మంచి వేదిక ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర చోట్ల కార్ రేసింగ్ జరిగింది. మన హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ రేసింగ్ శిక్షణకు, పోటీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో పాటు మలేసియా, జపాన్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ కూడా చాలా బాగుంది. అంతా తిరిగి చూశాం. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. – అనిందిత్‌రెడ్డి, హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్‌కు ఉత్తమ భవిష్యత్ మోటార్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న క్రీడ. ఈ క్రీడలో పాల్గొనే రేసర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. మన ఇండియాలో కూడా రేసింగ్‌లో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ శిక్షణ ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ రంగంలో గొప్ప అవకాశాలున్నాయి. – అఖిల్ రవీంద్ర, బెంగళూరు ఇండియాలో ఇదే తొలిసారి పారిస్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఇండియాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా ఉంది. 2016 నుంచి రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ పోటీలు నాకు చాలా ఇష్టం. – లోలా లోవిన్సాస్, ఫ్రాన్స్ ఇంగ్లిష్ చానళ్లలో మాత్రమే చూసేవాళ్లం కార్ రేసింగ్ అంటే ఇన్నాళ్లు టీవీలో.. అదికూడా ఇంగ్లిష్ న్యూస్ చానళ్లల్లో మాత్రమే చూసేవాళ్లం. అలాంటిది ఈ రేసింగ్ ఈవెంట్‌ను సిటీలో నిర్వహించడం మంచి అనుభూతినిచ్చింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో సిటీ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా వన్ వంటి గేమ్స్‌కు నగరం ఆతిథ్యమివ్వడంతో సిటీ గొప్పదనం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇకపై నగరవాసులు కూడా ఇలాంటి గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. – సంతోష్, మోడలింగ్ ఔత్సాహికుడు నగరానికి నయా కళ ఇలాంటి కార్ రేసింగ్ ఒక్కసారైనా చూస్తానా అని అనుకునేదానిని. సిటీలో స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి వేచి చూశాను. ఇలాంటి ఇండియన్ రేసింగ్ ఈవెంట్స్ మరెన్నో నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. మన రోడ్లపై రేసింగ్ కార్లు దూసుకుపోతుంటే ఏదో కొత్త కళ వచ్చింది. దేశ్యవాప్తంగా పాల్గొన్న రేసర్లను దగ్గరగా చూడటం మంచి అనుభూతి. – ఐశ్వర్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం