సాక్షి, సిటీబ్యూరో: సాగరతీరం మరోసారి ఉత్కంఠభరితమైన కార్ రేసింగ్‌కు సన్నద్ధమైంది. గత నెలలో సాంకేతికంగా ఎలాంటి పోటీలు లేకుండానే ముగిసిన రేసింగ్‌ను ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు జరుగనున్న ఈ పోటీల కోసం రేసింగ్ కార్లు మరోసారి నగరానికి చేరుకున్నాయి. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కిలోమీటర్‌ల స్ట్రీట్ సర్క్యూట్‌లో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 12 రేసింగ్ కార్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర నగరాలతో పాటు విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు.
రేసింగ్ రయ్....
హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు.
ట్రాఫిక్ నరకం..
ఇండియన్ రేసింగ్ లీగ్ దృష్ట్యా శుక్రవారం నుంచే నెక్లెస్‌రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. మింట్ కాపౌండ్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు ఈ మార్గంలోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైన పడిగాపులు కాయాల్సి రావడంతో వాహనదారులు నరకం చవి చూశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు. అటు మహాగణపతి వైపు నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారి స్తంభించింది. లోయర్‌ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర రూట్లలోనూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment