బీఆర్కే భవన్ వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది.
రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్‌లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు.
- మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది.
- ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు.
- రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు.
- బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు.
- నగరం నడిబొడ్డున ట్రాఫిక్‌ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది.
- మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది.
- వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి.
- ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment