hussain sagar lake
-
ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది. రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు. మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది. మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది. -
హుస్సేన్ సాగర్ తీరాన తొలిరోజు ముగిసిన కార్ రేసింగ్..
-
సాగర తీరంలో రయ్ రయ్.. పరుగులు తీసిన రేసింగ్ కార్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం నెక్లెస్ రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీశాయి. 60 నుంచి 80 సెకన్ల వ్యవధిలో ఒక ల్యాప్ చొప్పున పూర్తి చేశాయి. సాయంత్రం 4.18 గంటలకు మంత్రి కేటీఆర్ ట్రాక్‌ను సందర్శించి జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దాంతో రేసింగ్ కార్లు ముందుకు దూకాయి. వాయువేగంతో దూసుకెళ్లాయి. గంట పాటు పోటీలు జరిగాయి. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పోటీల కోసం 2.3 కిలోమీటర్ల ట్రాక్నే వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌లో 17 మలుపుల నుంచి 200 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీశాయి. ఈ పోటీలను వీక్షించేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. పిల్లలు, పెద్దలతో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడిగా కనిపించింది. మరోవైపు పోటీల నిర్వహణ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు, భద్రతా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను తిలకించేందుకు కేటీఆర్ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఆరు బృందాలు.. 12 కార్లు.. పోటీల్లో ఆరు బృందాలు పాల్గొన్నాయి. 12 రేసింగ్ కార్లను వినియోగించారు. హైదరాబాద్ బర్డ్స్ టీమ్‌లో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి, అఖిల్ రవీంద్ర, స్వీడన్ రేసర్ నీల్జానీ, ఫ్రెంచ్ రేసర్ లోలా లోవిన్సాస్లు ఉన్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు క్వాలిఫయింగ్తో పాటు ఒక ప్రధాన రేస్ జరగాల్సి ఉన్నా.. కొత్త ట్రాక్ కావడంతో రేసర్లు ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఆదివారం అన్ని రేసులూ జరగనున్నాయి. కుంగిన గ్యాలరీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కొద్దిగా కిందకు కుంగింది. మంత్రి కేటీఆర్ రావడంతో ఆయనతో పాటు చాలా మంది పైకి వచ్చారు. దీంతో గ్యాలరీ సామర్థ్యం కంటే ఎక్కువ మంది చేరడంతో ఒక వైపు బరువు పెరిగి గ్యాలరీ కుంగింది. అప్రమత్తమైన పోలీసులు కొంతమందిని కిందకు దింపారు. విరిగిపడిన చెట్టు కొమ్మ మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాలరీలు వెలవెల వేలాది మంది ప్రేక్షకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం తక్కువగానే కనిపించింది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి. చాలా మంది నెక్లెస్‌రోడ్డు, మింట్‌కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో ట్రాక్ బయట నించొని పోటీలను వీక్షించారు. హైదరాబాద్ మంచి వేదిక ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర చోట్ల కార్ రేసింగ్ జరిగింది. మన హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ రేసింగ్ శిక్షణకు, పోటీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో పాటు మలేసియా, జపాన్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ కూడా చాలా బాగుంది. అంతా తిరిగి చూశాం. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. – అనిందిత్‌రెడ్డి, హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్‌కు ఉత్తమ భవిష్యత్ మోటార్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న క్రీడ. ఈ క్రీడలో పాల్గొనే రేసర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. మన ఇండియాలో కూడా రేసింగ్‌లో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ శిక్షణ ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ రంగంలో గొప్ప అవకాశాలున్నాయి. – అఖిల్ రవీంద్ర, బెంగళూరు ఇండియాలో ఇదే తొలిసారి పారిస్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఇండియాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా ఉంది. 2016 నుంచి రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ పోటీలు నాకు చాలా ఇష్టం. – లోలా లోవిన్సాస్, ఫ్రాన్స్ ఇంగ్లిష్ చానళ్లలో మాత్రమే చూసేవాళ్లం కార్ రేసింగ్ అంటే ఇన్నాళ్లు టీవీలో.. అదికూడా ఇంగ్లిష్ న్యూస్ చానళ్లల్లో మాత్రమే చూసేవాళ్లం. అలాంటిది ఈ రేసింగ్ ఈవెంట్‌ను సిటీలో నిర్వహించడం మంచి అనుభూతినిచ్చింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో సిటీ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా వన్ వంటి గేమ్స్‌కు నగరం ఆతిథ్యమివ్వడంతో సిటీ గొప్పదనం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇకపై నగరవాసులు కూడా ఇలాంటి గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. – సంతోష్, మోడలింగ్ ఔత్సాహికుడు నగరానికి నయా కళ ఇలాంటి కార్ రేసింగ్ ఒక్కసారైనా చూస్తానా అని అనుకునేదానిని. సిటీలో స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి వేచి చూశాను. ఇలాంటి ఇండియన్ రేసింగ్ ఈవెంట్స్ మరెన్నో నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. మన రోడ్లపై రేసింగ్ కార్లు దూసుకుపోతుంటే ఏదో కొత్త కళ వచ్చింది. దేశ్యవాప్తంగా పాల్గొన్న రేసర్లను దగ్గరగా చూడటం మంచి అనుభూతి. – ఐశ్వర్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
ఏళ్లుగా సాగుతున్నాశుభ్రంకాని హుస్సేన్‌సాగర్
సాక్షి,సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక హుస్సేన్ సాగర మథనం మళ్లీ మొదటికొచ్చింది. ఏళ్లుగా రూ.కోట్లు ఖర్చు చేసినా సాగర్‌లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రపంచస్థాయి టెండర్లు పిలుస్తున్నా ఆశించినంత పురోగతి కనబడటం లేదు. ఏటికేడు స్వచ్ఛమైన నీరుగా రూపు మారకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఏటా గణేశ్ నిమజ్జనంతో వచ్చే వ్యర్థాలకు తోడు ముఖ్యంగా సాగర్ తీరంలో వెలిసిన నిర్మాణాల నుంచి ప్రతిరోజూ వచ్చి చేరుతున్న భారీ వ్యర్థాలతో సాగర్ తీవ్రంగా కలుషితమైదుర్వాసన వస్తున్న టాక్ ప్రజల నుంచి వినబడుతోంది. ఇక వేసవిలో అటువైపు వెళ్లే పర్యాటకులైనా, వాహనదారులైనా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ దుర్వాసన నుంచి విముక్తి కల్పించడంతో పాటు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓబీ) తగ్గడం, కెమికల్ అక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో వాటిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ తాజాగా ‘బయో రేమెడియేషన్ పద్ధతి’ చర్యలు చేపట్టేందుకు ప్రపంచస్థాయి టెండర్లను పిలిచింది. దీనివల్ల సాగర్‌కు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకిలా అవుతుందంటే.. సెప్టెంబర్, 2016లో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ నీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలైన హానికారక రసాయనాలు సైతం ఉన్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటి దాకా కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగర గర్భంలోనే ఉంది.రెండేళ్ల క్రితం అమీర్‌పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న మెయిన్ మురుగు పైప్‌లైన్‌కు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గండి పడడంతో మురుగు నీరంతా హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. అలాగే ఏటా గణేశ్ నిమజ్జనాలకు తోడు తీర నిర్మాణంలోని నుంచి వ్యర్థాలు సాగర్‌లోకి భారీగా చేరుతున్నాయి. సాగర్ చుట్టూ ఇష్టారీతిన కమర్షియల్ కార్యకలాపాలకు హెచ్ఎండీఏ అనుమతివ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని నాలాల ద్వారా వచ్చే మురుగునీటితో ఇబ్బందులుండగా ఎస్టీపీల నిర్మాణంతో కొంత నియంత్రించగలిగారు. గణేశ్ విగ్రహలతో తీవ్ర ప్రభావం ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళంగా మారింది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావసరమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికర రసాయనాలు జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జైకా రుణం.. రూ.310 కోట్లతో సాగర్ శుద్ధికి చర్యలు తీసుకున్నా తీర ప్రాంతాల్లోని నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలే సాగర్ శుద్ధిని మలినం చేస్తున్నాయనే మాట వినబడుతోంది. ‘బయో రెమెడియేషన్’తో ఉపశమనం ప్రధానంగా వేసవితో పాటు మిగిలిన కాలాల్లో సందర్శకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ దుర్వాసనను పూర్తిగా తగ్గించేందుకు గతేడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చేసిన ‘బయో రెమెడియేషన్’ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. సుమారు రూ.3 కోట్లతో బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ దుర్వాసన నుంచి కొంతమేర విముక్తి కల్పించింది. మొదటిæదశలో ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా సాగర్‌లో చల్లారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు చనిపోయి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగింది. రెండో దశలో బొకా షిబాల్స్ను జలాశయంలోకి వదిలారు. ఈ రసాయనాలు అడుగున ఉన్న బ్యాక్టీరియాను తినేస్తుంది. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడంతో పాటు అక్సిజన్ శాతం పెరుగుతోంది. ఈసారి కూడా బయో రెమెడియేషన్ కోసం హెచ్ఎండీఏ మళ్లీ ప్రపంచస్థాయి టెండర్లను ఆహ్వానించింది. -
‘ప్రాణ’హితుడు
ఎంతో మందిని రక్షించిన శివ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మురుగు నీటిలోని శవాలను వెలికి తీయడంతో పాటు ఎంతోమందిని కాపాడినందుకు మహేందర్‌రెడ్డి నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శివను అవార్డుతో సత్కరించారు. రాంగోపాల్‌పేట్: అప్పుడు సమయం సాయంత్రం 3 గంటలు.. ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే ఉన్నాయి. కొంత మంది ఫుట్‌పాత్‌పై నడుస్తూ హుస్సేన్ సాగర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉన్నట్లుండి ఓ 45 ఏళ్ల వ్యక్తి సాగర్ నీళ్లలోకి దూకేశాడు. వెంటనే వాహనదారులు, పాదాచారులు అందరు గుమికూడారు.. అయ్యో ఎవరో దూకేశారు అంటున్నారే తప్ప రక్షించేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొద్ది దూరంలో ఉన్న ఓ వ్యక్తి అది గమనించి నీళ్లలోకి నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కడుపులోని నీళ్లు కక్కించి శ్వాస అందించి ప్రాణాలు కాపాడాడు. మిట్ట మధ్యాహ్నం ఓ మహిళ ట్యాంక్‌బండ్‌పై ఏడ్చుకుంటూ రోడ్డు దాటి వచ్చి హుస్సేన్ సాగర్‌లోకి దూకేసింది. అప్పటికే ఆమె పరిస్థితిని గుర్తించి అనుసరిస్తున్న వ్యర్తి వెంటనే సాగర్‌లోకి దూకి మునిగిపోతున్న ఆమెను బయటకు తీశాడు. ఆమె ప్రాణాలతో భయట పడ్డది కానీ ఆ వ్యక్తి కుడి చేయి భుజం వద్ద ఓ ఇనుప చువ్వ గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అయినా అతడిలో ఓ ప్రాణం కాపాడన్న ఆనందం ఉంది తప్ప గాయాన్ని మాత్రం పట్టిచుకోలేదు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు ఏవేవో సమస్యలతో బాధలతో హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలని దూకేసిన 107 మందిని అతను రక్షించాడు. అందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అతడి పేరు ‘శివ’. ట్యాంక్బండ్నే అడ్డాగా మార్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటూ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఒకవైపు ప్రాణాలు కాపాడుతూ సాగర్‌లో పడిచనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడమే ఒక దైవ కార్యంగా చేపట్టాడా సాహసి. రైలు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారి మృతదేహాలు తరలింపుతో మొదలైన అతడి ప్రస్థానం హుస్సేన్ సాగర్‌లో మృతదేహల వెలికితీతతో పాటు ఎంతో మంది పునర్జన్మ నిచ్చిన వ్యక్తిగా నిలుస్తున్నాడు. సోదరుడి లాంటి వ్యక్తి మరణంతో.. శివ జీవితం మొత్తం ఫుట్‌పాత్ మీదే సాగింది.. సాగుతుంది కూడా. శివకు ఐదేళ్ల వయసులో ఫుట్‌పాత్‌పై తిరుగుతుండగా ఎవరో చాదర్‌ఘట్‌లోని సిధూర్ హాస్టల్లో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్‌లోని మరో హాస్టల్‌కు మకాం మారింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివసించే మల్లేశ్వరమ్మ అనే మహిళ శివను చేరదీసింది. అమె కొడుకు మహేందర్, శివ అన్నదమ్ముల్లా ఉండేవారు. శివ చిన్న వయసులోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సాయంగా వెళ్లేవాడు. తర్వాత హుస్సేన్ సాగర్‌లో మృతదేహాలను వెలికి తీసేవాడు. మహేందర్ మృతితో మార్పు తనకు అన్నలాంటి మహేందర్ 2013లో హస్మత్‌పేట్ చెరువులో మునిగి చనిపోయాడు. దాంతో తల్లిలా పెంచిన మల్లేశ్వరమ్మ బాధ చూడలేకపోయాడు శివ. అప్పటి నుంచి నీటిలో మునిపోతున్న వారిని రక్షించాలన్న సంకల్పంతో హుస్సేన్ సాగర్ పరిసరాలనే తన నివాసంగా మార్పుచుకున్నాడు. సాగర్ నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. దాంతో మిత్రుడు పవన్‌తో కలిసి వైజాగ్ సముద్ర జలాల్లో ఈత సాధన చేసి గజ ఈతగాళ్లుగా మారారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ ఇదే హుస్సేన్ సాగర్‌లో ప్రమాదవశాత్తు మరణించాడు. ఉపాధి చూపించిన సాగర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న శివకు హుస్సేన్ సాగరే ఉపాధి చూపించింది. గణపతి నిమజ్జనాల సందర్భంగా సాగర్‌లో దొరికే ఇనుప చువ్వలు వెలికితీసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతుంటాడు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తే పోలీసులు కొంత డబ్బు ఇస్తుంటారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివ. ఇటీవల సినిమా షూటింగ్‌లకు నటులకు బౌన్సర్‌గా వెళుతూ ఇంకొంత సంపాదించుకుంటున్నానని చెబుతున్నాడు. తన ఏడుగురు సంతానంతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఫుట్‌పాత్, పాడుబడిన లేపాక్షి భవనం వద్ద నివాసం ఏర్పరచుకున్నాడు. శివ కుటుంబానికి లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి ఆసరాగా నిలిచారు. ఆమె మేలు ఎప్పటికీ మరచిపోలేనంటున్నాడు శివ. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో ధనలక్ష్మి మాట్లాడి శివ ముగ్గురు కుమారులను రెసిడెన్సియల్ పాఠశాలలో చేర్పించారు. -
ఏందీ..వాసన..!
ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో అలరారిన చారిత్రక హుస్సేన్‌సాగర్ గరళ కాసారంగా మారింది. మండుటెండలో సాగర తీరాన సేదదీరేందుకు నెక్లెస్ రోడ్‌కు వచ్చేవారికి సాగర్ నుంచి వచ్చే దుర్వాసన స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలతో సతమతమవుతుండడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఘనవ్యర్థాలు, గుర్రపుడెక్కతో సాగరజలాలు నిండిపోయాయి. ఇందులోని బ్యాక్టీరియా..కూకట్పల్లి, బాలానగర్ నాలా ద్వారా చేరుతున్న పారిశ్రామిక రసాయన వ్యర్థజలాల్లోని సల్ఫేట్‌ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి ‘హైడ్రోజన్ సల్ఫేట్’ వాయువు పెద్ద మొత్తంలో వెలువడుతోంది. ఈ దుర్వాసనకు ఇదే కారణమని నిపుణులు తేల్చారు. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మండుటెండలకు ఈ వాయువు తీవ్రత మరింత పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు సాగర్ ప్రక్షాళన పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు. సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ జలాల్లోకి కూకట్పల్లి నాలా రసాయన వర్థాలు కలవకుండా ఉండేందుకు నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిచారు. కానీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌ను ప్రక్షాళనకు వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని.. చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఙానభూమి నుంచి కిమ్స్ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుతం సాగర్ దుస్థితికిఅద్దంపడుతోంది. మిషన్ హుస్సేన్సాగర్లోచేపట్టాల్సినవి.. జలాశయం నీటిని ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. సాగర్‌లోకి ఘనవ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టాలి. దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించాలి. నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం తప్పనిసరి. జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ అధునికీకరణతో పాటు సామర్థ్యం పెంచాలి. హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్ సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడాలి. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు చూడాలి. జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి. స్వచ్ఛ‘సాగర’ం దిశగా.. హుస్సేన్ సాగర్‌ను స్వచ్ఛంగా మార్చే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాన్నివ్వలేదు. కెనడాకు చెందిన ఎజాక్స్ ఎన్విరాన్మెంట్ ఎల్ఎల్పీ ఆధునిక సాంకేతికతతో జలాశయంలో ఆక్సిజన్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా శాటిలైట్ సహాయంతో మైక్రోవేవ్స్‌ను నీటిలోకి పంపించారు. దీంతో నీటిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుందని.. తద్వారా సాగర గర్భంలో ఉన్న నైట్రేట్, పాస్పేట్ వంటి మూలకాలు ఉపరితలంపైకి వచ్చి ఆల్గేగా ఏర్పడుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఆల్గేను దశలవారీగా తొలగించడం ద్వారా నీటి నాణ్యత మెరుగుపడుతుందనీ చెప్పారు. కానీ ఈ ప్రయోగం విఫలమవడంతో నెలరోజుల క్రితమే ఈ పనుల నుంచి ఎజాక్స్ కంపెనీ తప్పుకున్నట్లు తెలిసింది. మరోసారి హెచ్ఎండీఏ సన్నద్ధం.. కాలుష్యంతో నిండిన హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛంగా మార్చేందుకు హెచ్ఎండీఏ మరోసారి సన్నద్ధమవుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మార్పు కనిపించేలా సాంకేతిక చికిత్స అందజేసేందుకు ముందుకు రావాలంటూ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దాదాపు ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఆయా కంపెనీల అనుభవం, పనితీరును బట్టి త్వరలోనే ఫైనల్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా జలమండలి సీఐపీపీ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగుతల్లి ఫైఓవర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు భారీ మురుగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనుల వల్ల నేరుగా మురుగునీరు, రసాయన కారకాలు సాగర్‌లో కలుస్తుండడంతో మురికి కూపంగా మారడం గమనార్హం. దీనివల్ల డీఓ (కరిగిన ఆక్సిజన్) తగ్గి, బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) డిమాండ్ పెరిగిపోయినట్టుగా స్పష్టమవుతోంది. సాగర మథనం సాగుతోందిలా.. ♦ ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలా ♦ ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ♦ 2014లో: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ♦ 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలు తొలగింపు ♦ 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ♦ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు -
హుస్సేన్ సాగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి లేక్ పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే రక్షించారు. తాగుబోతు భర్త అమానుషంగా చితకబాదడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని బాధితురాలు కళ్యాణి తెలిపింది. భోలక్‌పూర్ మేకలమండికి చెందిన కల్యాణి భర్త చిన్ని రాజు వేధింపులు భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని లేక్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించివేసినట్లు తెలిసింది. -
హస్సేన్ సాగర్‌లో మహిళ మృతదేహం
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్ చెరువులో శుక్రవారం పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలు నీలం రంగు పంజాబీ దుస్తులు ధరించి ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర్ చుట్టూ హైఫై టవర్స్..