సాక్షి,సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక హుస్సేన్ సాగర మథనం మళ్లీ మొదటికొచ్చింది. ఏళ్లుగా రూ.కోట్లు ఖర్చు చేసినా సాగర్‌లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రపంచస్థాయి టెండర్లు పిలుస్తున్నా ఆశించినంత పురోగతి కనబడటం లేదు. ఏటికేడు స్వచ్ఛమైన నీరుగా రూపు మారకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఏటా గణేశ్ నిమజ్జనంతో వచ్చే వ్యర్థాలకు తోడు ముఖ్యంగా సాగర్ తీరంలో వెలిసిన నిర్మాణాల నుంచి ప్రతిరోజూ వచ్చి చేరుతున్న భారీ వ్యర్థాలతో సాగర్ తీవ్రంగా కలుషితమైదుర్వాసన వస్తున్న టాక్ ప్రజల నుంచి వినబడుతోంది. ఇక వేసవిలో అటువైపు వెళ్లే పర్యాటకులైనా, వాహనదారులైనా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ దుర్వాసన నుంచి విముక్తి కల్పించడంతో పాటు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓబీ) తగ్గడం, కెమికల్ అక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో వాటిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ తాజాగా ‘బయో రేమెడియేషన్ పద్ధతి’ చర్యలు చేపట్టేందుకు ప్రపంచస్థాయి టెండర్లను పిలిచింది. దీనివల్ల సాగర్‌కు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఎందుకిలా అవుతుందంటే..
సెప్టెంబర్, 2016లో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్‌పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ నీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలైన హానికారక రసాయనాలు సైతం ఉన్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటి దాకా కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగర గర్భంలోనే ఉంది.రెండేళ్ల క్రితం అమీర్‌పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న మెయిన్ మురుగు పైప్‌లైన్‌కు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గండి పడడంతో మురుగు నీరంతా హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. అలాగే ఏటా గణేశ్ నిమజ్జనాలకు తోడు తీర నిర్మాణంలోని నుంచి వ్యర్థాలు సాగర్‌లోకి భారీగా చేరుతున్నాయి. సాగర్ చుట్టూ ఇష్టారీతిన కమర్షియల్ కార్యకలాపాలకు హెచ్‌ఎండీఏ అనుమతివ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని నాలాల ద్వారా వచ్చే మురుగునీటితో ఇబ్బందులుండగా ఎస్టీపీల నిర్మాణంతో కొంత నియంత్రించగలిగారు.
గణేశ్ విగ్రహలతో తీవ్ర ప్రభావం
ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళంగా మారింది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావసరమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికర రసాయనాలు జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జైకా రుణం.. రూ.310 కోట్లతో సాగర్ శుద్ధికి చర్యలు తీసుకున్నా తీర ప్రాంతాల్లోని నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలే సాగర్ శుద్ధిని మలినం చేస్తున్నాయనే మాట వినబడుతోంది.
‘బయో రెమెడియేషన్’తో ఉపశమనం
ప్రధానంగా వేసవితో పాటు మిగిలిన కాలాల్లో సందర్శకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ దుర్వాసనను పూర్తిగా తగ్గించేందుకు గతేడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చేసిన ‘బయో రెమెడియేషన్’ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. సుమారు రూ.3 కోట్లతో బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ దుర్వాసన నుంచి కొంతమేర విముక్తి కల్పించింది. మొదటిæదశలో ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా సాగర్‌లో చల్లారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు చనిపోయి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగింది. రెండో దశలో బొకా షిబాల్స్‌ను జలాశయంలోకి వదిలారు. ఈ రసాయనాలు అడుగున ఉన్న బ్యాక్టీరియాను తినేస్తుంది. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడంతో పాటు అక్సిజన్ శాతం పెరుగుతోంది. ఈసారి కూడా బయో రెమెడియేషన్ కోసం హెచ్‌ఎండీఏ మళ్లీ ప్రపంచస్థాయి టెండర్లను ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment