సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ట్రాఫిక్ తిప్పలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, మెట్రో–2, 3, 4 దశలు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టులు 2023 వరకు వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో జీవనాడి అయిన లోకల్ రైళ్లు సహా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది.
దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రతీరోజు కొన్ని వందల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడమే. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో పాటు వాహనాలలో నుంచి వెలువడుతున్న పొగ, ఇతర విష వాయువులు, ధ్వని కాలుష్యం వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో ముంబైకర్లకు స్వచ్చమైన గాలి, ప్రశాంత వాతావరణం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైకర్లకు ట్రాఫిక్ జామ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు స్వచ్చమైన గాలితో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రణాళికలు రచించింది.
చదవండి: ('పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం)
ఈ క్రమంలోనే బీఎంసీ పరిపాలనా విభాగం కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మెట్రో–2, 3, 4 దశల ప్రాజెక్టులు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముంబైలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా శాతం వరకు తీరనుంది. ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రెండు గంటల్లో పూర్తి అవుతున్న ప్రయాణం అప్పుడు అర గంటలోనే ముగుస్తుంది. అలాగే, బీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపు 45 శాతం పూర్తి కావచ్చాయని మంత్రి ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇక, ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి వర్లీ సీ–లింకు వరకు 10.58 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. ఇందులో నాలుగు లేన్లు (2+2) ఉంటాయి.
ఈ మార్గం కొన్ని చోట్ల నేలపై నుంచి, మరికొన్ని చోట్ల భూగర్భం లోపలి నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2,300 టన్నుల భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలబార్ హిల్ వద్ద భూగర్భం లోపల తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా 2023 వరకు పూర్తికానున్నాయి. ఈ పనుల కోసం బీఎంసీ ఏకంగా రూ. 12,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే తరహాలో మెట్రో వివిధ ప్రాజెక్టు పనులు, శివ్డీ–నవశేవా సీ–లింకు పనులు కూడా పూర్తవుతాయని ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ్డీ–నవశేవా సీ–లింకును వర్లీ–బాంద్రా సీ–లింకుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వర్లీలో సీ–లింకు వంతెన పైకెక్కిన వాహనాలు శివ్డీ–నవశేవా మీదుగా నేరుగా నవీ ముంబైలో బయటకు వస్తాయి.
ప్రస్తుతం ట్రాఫిక్ ఉన్న సమయంలో వర్లీ నుంచి నవీ ముంబై చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. కానీ, సీ–లింకు మీదుగా వెళితే సుమారు 30–45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీంతో వాహనదారుల విలువైన సమయంతో పాటు వాహనాల ఇంధనం కూడా దాదాపు 50–70 శాతం వరకు ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం కూడా సగానికి పైగా తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ముంబైకి ఎంతగానో దోహదపడుతాయని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment