మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుంది. మెట్రో రైలు కేవలం ప్రజా రవాణా పరంగానే కాక నగరాభివృద్ధిలోనూ కొత్త మార్పులకు నాంది పలకనుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బడిముబ్బడిగా జరుగుతోన్న అభివృద్ధి నగరం నలుచెరుగులా...అన్ని ప్రాంతాలకూ విస్తరించనుంది. సమతుల అభివృద్ధి సాధ్యంకానుంది. ఇప్పటి వరకు దూరాభార ప్రయాణం, ట్రాఫిక్ సమస్యలు, వాహన కాలుష్యం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఎక్కడ ఉపాధి, పరిశ్రమలు ఉంటే ప్రజలు అక్కడే నివాసాలుంటున్నారు. మెట్రోతో ప్రయాణం సులువుగా మారడంతో ఇకపై ఈ పరిస్థితి మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా...ఇష్టమైన చోటే నివాసం ఉంటూ..ఈజీగా జర్నీ చేయవచ్చని నగరవాసులు భావిస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలుండటంతో అంతా అటే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు పెరగడంతో వారిని దృష్టిలో ఉంచుకొని ఇతరత్రా వ్యాపారాలు, హోటళ్లు తదితరమైనవి పెరిగాయి. ఇలా అన్ని రంగాల్లోనూ కొన్ని చోట్లే అభివృద్ధి కేంద్రీకృతమవుతోంది. మెట్రో రైలు రాకతో ఎక్కడినుంచి ఎక్కడికైనా 45 నిమిషాల్లో చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రజలు ఎక్కడ నివాసమున్నప్పటికీ సకాలంలో విధులకు చేరుకోగలుగుతారు. మహా అయితే గంట పట్టొచ్చు. అంతకు మించి సమయం పట్టదు కనుక ఎక్కడ నివాసం ఉన్నప్పటికీ ప్రయాణ ఇబ్బందులుండవు. మెట్రోరైల్లో సుఖవంతమైన ఏసీ ప్రయాణం. కాలుష్యం ఉండదు. గంటల తరబడి జర్నీ తిప్పలు, ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. కాబట్టి సదుపాయవంతంగా నివాసం దొరికితే ఎక్కడ ఉండేందుకైనా ప్రాధాన్యతనిస్తారు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అద్దెలకుండాలనుకున్నా తక్కువ ధరలకు దొరికే ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
జనాభా పెరిగినా..
2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ పరిధిలో 67.31 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కోటి దాటినట్లు అంచనా. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఐటీ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలోనివారు, కూలికి ఢోకా ఉండని ప్రాంతాల్లో శ్రామికులు నివాసాలుంటున్నారు. అందువల్లే కార్పొరేటర్ డివిజన్లలోనూ ఒక డివిజన్‌లో 30 వేల జనాభా ఉంటే మరో డివిజన్‌లో 70 వేల జనాభా ఉంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. అన్ని ప్రాంతాల్లోనూ నగరం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ..
ప్రస్తుతం మియాపూర్ నుంచి అమీర్‌పేటకు 13 కి.మీ, అమీర్ పేట నుంచి నాగోల్‌కు 17 కి.మీ. వెరసి మొత్తం 30 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరో సంవత్సరంలో..అంటే 2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేటకు, అమీర్‌పేట నుంచి రాయదుర్గం, అలాగే జూబ్లీ బస్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్టేషన్ వరకు వివిధ మార్గాల్లో 66 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం కలుగనుంది. తదుపరి దశలో మరో వంద కి.మీ.ల మేర మెట్రో పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్లు కొనుక్కునే వారు అందుబాటు ధరలు, ఇతర సదుపాయాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే తరుణంలో మెట్రో స్టేషన్లకు సమీపంలోని ఇళ్లు, అద్దెల ధరలు భారీగా పెరగనున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు సెకండరీ రవాణాను అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.
మెట్రో వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి
మెట్రో రైలు ప్రయాణం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వాహన కాలుష్యం , ట్రాఫిక్ చిక్కులుండవు. ప్రజలకు మెట్రో సంస్కృతి అలవడుతుంది. అంటే మెట్రో స్టేషన్ల వద్ద మాల్స్‌లో కొనుగోళ్లు తదితరమైనవి. అయితే మెట్రో స్టేషన్ల వద్ద తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించాలి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రజలు కూడా మెట్రోరైలును తమదిగా భావించి పరిశుభ్రంగా ఉంచాలి. ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు మెట్రోల్లో ప్రయాణం చేయడం ద్వారా మిగతా వారూ మెట్రోరైల్లోనే ప్రయాణిస్తారు. తద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాలు తగ్గుతాయి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Please login to add a commentAdd a comment