మిర్యాలగూడ : తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అసూయ కలుగుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తే రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉంటాయన్నారు. చంద్రబాబు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండి కూడా తెలంగాణను చూసి అసూయ పడడం సరికాదని హితవుపలికారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదని ఎప్పుడో చెప్పాడని.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వారు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. భవనాలు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు కూడా అప్పటివేనని అన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న డ్రెయినేజీ వ్యవస్థ కూడా అప్పటిదే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మిగులు బడ్జెట్‌తోనే ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు చేపట్టిన ఉద్యమంలో వల్ల తెలంగాణ ఏర్పడిందనన్నారు. చంద్రబాబునాయుడు కూడా ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చాడని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, ఎంపీపీ జానయ్య, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మదార్‌బాబా, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment