బాధితులందరికీ నష్టపరిహారం
విశాఖ రూరల్ : తుపాను నష్టం అంచనా వేగంగా సాగుతోందని, ప్రతీ బాధితునికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. జెడ్పీసాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల నష్టాలకు సంబంధించి ఏజెన్సీలో 6 మండ లాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అంచనాలు పూర్తయ్యాయని, శనివారం అన్ని మండల, గ్రామ కార్యాలయాల్లో జాబితాను ఉంచుతామని, ఎవరి పేరైనా లేకపోతే రెండు రోజుల్లో సంబంధిత తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇతర ప్రాంతాల నుంచి బృందాలను రప్పించి అంచనాలు సిద్ధం చేస్తామన్నారు. 50 శాతం కన్నా తక్కువ నష్టం జరిగినా చెట్టును పరిగణలోకి తీసుకొని అంచనాలు రూపొందిస్తామన్నారు.
ఆదర్శంగా జెడ్పీ సమావేశాలు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించేందుకు ఇది చక్కని వేదిక అని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశాలను మొక్కుబడిగా కాకుండా ఇతర జిల్లాకు విశాఖ జెడ్పీ మోడల్‌గా తీసుకొనే స్థాయిలో పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారంపై దృషి సారించాలని పిలుపునిచ్చారు. తుపాను నష్టం అంచనాలు జరుగుతున్నాయని, క్షేత్ర స్థాయిలో నష్టాలు సభ్యులకు తెలుస్తుందని, అంచనా బృందాలకు సహకరించి ప్రతీ ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
రీచ్‌ల ఆదాయం స్థానిక సంస్థలకే దక్కాలి
అజెండాలోకి వెళ్లే ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. రీచ్‌ల నుంచి వచ్చే ఆదాయం శతశాతం స్థానిక సంస్థలకు చెందాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కోరారు. అరకు ఎంపీ కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీలో ఇసుక రీచ్‌లు ఇంకా గుర్తించలేదని, ప్రత్యేక ఇసుక పాలసీని చేయకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఏజెన్సీలో వారం రోజుల్లో ఇసుక రీచ్‌లు గుర్తిస్తామని డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ తుపాను పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరగా సభ్యులు అందుకు అంగీకారం తెలిపారు.
ఒక్కో అంశంపై పది నిమిషాలే
అజెండాను ప్రారంభించిన తరువాత ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై చర్చించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి పీహెచ్‌సీ కంటే ధారణంగా ఉందని, పూర్తి స్థాయిలో వైద్యులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, దోబీలు లేరని పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చే కేసులను కేజీహెచ్‌కు పంపిస్తున్నారని, 108 అంబులెన్సుకు ఫోన్ చేస్తే రాడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుందని, ఆస్పత్రి అంబులెన్సుకు డీజిల్ లేదని తెలిపారు. వైద్యులతో పాటు టెక్నీషియన్స్‌కు ఏడు నెలలుగా జీతాలు లేవని, ప్రతీ నెలా సక్రమంగా వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో వైద్యులపై దాడులు జరగకుండా పోలీసులను ఏర్పాటు చేయాలని కోరారు.
ఏజెన్సీలో అనేక వ్యాధులతో పాటు కళ్లకలకలు ఎక్కువగా ఉన్నాయని ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌కు సూచించారు. అనంతరం విద్యుత్, హౌసింగ్, వ్యవసాయం అంశాలపై పదేసి నిమిషాలు చర్చించారు. ప్రతీ అంశంపైనా కేవలం ఎమ్మెల్యేలే మాట్లాడుతూ జెడ్పీటీసీలకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల టీడీపీ జెడ్పీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల్లో జెడ్పీటీసీలకు కూర్చీ లేదని, ఆ సౌకర్యం కల్పించాలని పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు కోరారు.