
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్‌కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.
తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్‌కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది.
సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment