ముందే పలకరించిన వానలు : రెయిన్‌కోట్లకు, గొడుగులకు భలే బేరం!    | Early Rains demand for raincoats and umbrellas! | Sakshi
Sakshi News home page

ముందే పలకరించిన వానలు : రెయిన్‌కోట్లకు, గొడుగులకు భలే బేరం!   

Jun 5 2025 4:38 PM | Updated on Jun 5 2025 8:44 PM

Early Rains demand for raincoats and umbrellas!

కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు 

పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్న వర్షాలు 

అకాల వర్షాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు  చేసుకోకపోవడంతో తిప్పలు 

మార్కెట్లకు పరుగులు తీస్తున్న జనం   

దాదర్‌: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్‌ కోట్లు, ప్లాస్టిక్‌ క్యాప్‌లు తదితర సామగ్రి విక్రయించే హోల్‌సేల్‌ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్‌ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్‌ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.  

రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్‌ కోటు
ముంబైలో దాదర్, క్రాఫర్డ్‌ మార్కెట్, చెంబూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్‌సేల్‌ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్‌ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్లు, స్పైడర్‌ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్‌ బొమ్మలతో కూడిన రెయిన్‌ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్‌ జాకెట్లు,  ప్యాంట్లు, క్యాప్‌లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్‌ కవర్లు, బైక్‌లు, కార్లపై కప్పడానికి  వినియోగించే ప్లాస్టిక్‌ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్‌ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. 

చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!

రెయిన్‌ కోట్‌ రూ.30 నుంచి రూ.150 లోపే.. 
ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్‌ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్‌ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్‌ ఫోల్డింగ్‌ గొడుగులు, ట్రాన్స్‌పరెంట్‌ రెయిన్‌ కోట్లు, క్యాప్‌లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్‌ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్‌ ప్లాస్టిక్‌ బూట్లు, రబ్బర్‌ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్‌ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్‌ అండ్‌ త్రో రెయిన్‌ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్‌ కోట్‌ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్‌ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.  

ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement