‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్‌లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్‌లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.
ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.
నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.
ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్‌సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.
మెదడులో మార్పులే కారణం...
సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్‌మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్‌మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.
చికిత్స తప్పనిసరి అవసరం..
అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.
అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.
అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment