Online Cheat
-
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ అని ఆశపడ్డావో, అంతే!
‘‘5 పైసలు కొట్టేస్తే పెద్ద తప్పు కాదు, 5 కోట్లసార్లు 5 పైసలు కాజేస్తే.. తప్పే. అదే 5 కోట్ల మంది ఐదుసార్లు 5 పైసలు కాజేస్తే.. అది తప్పకుండా మెగా తప్పు అవుతుంది’’ఒక సినిమాలో హీరో అవినీతిపై చెప్పే డైలాగ్ ఇది.. వాస్తవానికి ఇందులో కంటికి కనిపించని మోసం, కుంభకోణం ఉన్నాయి. సాధారణంగా చిన్నమొత్తం మోసపోయిన వారెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. పరువు, ఆత్మాభిమానాలను ఆయుధంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా టీనేజీ కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని డేటింగ్ యాప్స్ ముసుగులో రోజుకు కోట్లు కొట్టేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గత నాలుగేళ్లలో ఈ డేటింగ్ యాప్స్ మోసాలు నాలుగురెట్లు పెరిగాయి. డేటింగ్ యాప్‌లకు అమెరికా తరువాత ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇవి 2020లో మనదేశంలోని యువకుల నుంచి రూ.2,394 కోట్లు లాగేశాయి. – సాక్షి, హైదరాబాద్ టీనేజీ, పెళ్లికాని కుర్రాళ్లే లక్ష్యంగా కొన్ని విదేశీ కంపెనీలు ఇండియాలో డేటింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదించేందుకు డేటింగ్ యాప్‌ల పేరిట అక్రమమార్గం ఎంచుకున్నాయి. యాప్స్ నిర్వాహకులు చాలా తెలివిగా ఉచ్చులోకి లాగి, వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇంకా కొందరి వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తూ.. ఇక్కడి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎలా మోసం చేస్తారంటే..! వీరు చేసే మోసాలకు సోషల్ మీడియానే వేదిక. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన నరేశ్ ఒకరోజు సోషల్ మీడియాలో లామోర్ అనే డేటింగ్ యాప్ యాడ్ చూశాడు. అందమైన యువతులు మీ స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు అన్న క్యాప్షన్‌తో ఆకర్షితుడయ్యాడు. దాంతో వెంటనే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ఓపెన్ చేయగానే.. ఒకేసారి పదుల సంఖ్యలో అమ్మాయిలు తమతో స్నేహం చేయాలని సందేశాలు పంపారు. ఆ అమ్మాయిలతో చాట్ చేయాలంటే రూ.199 చెల్లించాలని షరతు విధించారు. రూ.199 కదా అని చెల్లించాడు. చాలామందితో చాట్ చేశాడు. మరికొందరు వీడియో చాట్ చేయాలని ఉందని చెప్పారు. వారి కాల్స్ వస్తున్నా.. ఆన్సర్ చేయలేకపోతున్నాడు. వారి కాల్ లిఫ్ట్ కావాలంటే మరోసారి రూ.499 చెల్లించాలని సందేశం వచ్చింది. అలా చేస్తే 1,600 డైమండ్లు వస్తాయి. అవి అయిపోయే వరకు మాట్లాడవచ్చన్నది దాని సందేశం. దీంతో తాను ట్రాప్‌లో ఇరుక్కున్నానని అర్థం చేసుకొని అంతటితో వదిలేశాడు. ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అందులో చైనావే అధికం. చైనాకే చెందిన లామోర్ డేటింగ్‌యాప్ ఇలా మన దేశంలో గతేడాది రూ.199 ప్యాకేజీల పేరిట దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన మిగిలిన డేటింగ్ యాప్‌లు ఇంకెంత సంపాదించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాప్ నిర్వాహకులు ఇలా సంపాదించిన డబ్బును బిట్కాయిన్ల రూపంలోకి మార్చి తమ దేశాలకు తీసుకెళ్తున్నారు. పరువు కోసం మౌనం..: ఇలా నమ్మి మోసపోయిన వారు ఏటా లక్షల్లో ఉంటారు. వారు పోగొట్టుకునే డబ్బు రూ.కోట్లలో ఉంటుంది. వీరంతా 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం. రూ.199 పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. ఒకవేళ చేసినా.. వారు ఇలాంటి యాప్స్‌ను ఎందుకు డౌన్లోడ్ చేశావని మందలిస్తారు. దీంతో నలుగురిలో పరువు పోతుందని భయపడతారు. పరువు, చిన్నమొత్తమే కదా అన్న రెండు అంశాలే ఆయుధంగా నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఇలాగే డేటింగ్ వెబ్సైట్లో అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. వాటిని రికార్డు చేసి అతన్నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇలాంటి బెదిరింపులకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజెన్సీలతో రిక్రూట్మెంట్.. ఇలాంటి డేటింగ్ సైట్లలో పనిచేసే అమ్మాయిలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. టాలెంట్ ఏజెన్సీ పేరుతో వీరు అమ్మాయిలను ఉద్యోగాల కోసం పంపుతారు. వీరు చేయాల్సిందల్లా.. అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడటమే. ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత ఎక్కువ డబ్బు వీరికి వస్తుంది. సోనోకాన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఇది ఇప్పటివరకు 15 డేటింగ్ యాప్‌లకు రెండువేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసింది. సోనోకాన్లాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. కొన్ని గణాంకాలు పరిశీలిస్తే.. డేటింగ్ యాప్స్ ద్వారా ఏటా మోసపోతున్న మొత్తం రూ.2,394 కోట్లు సగటున రోజుకు పోగొట్టుకుంటున్నది రూ.6.5 కోట్లు ఏటా మోసపోతున్న యువకులు 12 కోట్లు సగటున నిమిషానికి మోసపోతున్న యువకులు 229 వీటికి దూరంగా ఉండాలి డేటింగ్ యాప్స్‌లో అధిక భాగం పశ్చిమబెంగాల్ నుంచి నడుస్తున్నాయి. ఇందుకోసం ఆయా కంపెనీలు అమ్మాయిలతో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీరు అబ్బాయిలే లక్ష్యంగా చేసుకుని కాల్స్ చేస్తున్నారు. వారిని తమ మాయమాటలతో ముగ్గులోకి దింపి న్యూడ్ కాల్స్ చేయిస్తున్నారు. వాటిని వీడియో తీసి, తిరిగి వారికే పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరూ కూడా అందమైన అమ్మాయిల ఫొటోలు చూపి వల వేసే కాల్స్‌ను నమ్మొద్దు. డేటింగ్ యాప్స్, సైట్స్‌కు దూరంగా ఉండటం మంచిది. – ప్రసాద్, ఏసీపీ, సీసీఎస్ -
ఆన్లైన్ మోసం..!
నల్లగొండ క్రైం : చాకచక్యంతో ఓ వ్యక్తి ఖాతా నుంచి ఓ మోసగాడు చేసిన రూ. 5 లక్షల దోపిడీని పోలీసులు అడ్డుకున్నారు. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మాన్కంచల్కకు చెందిన ముక్కమల్ల దాదాబాషా బత్తాయి వ్యాపారం చేస్తుంటాడు.బత్తాయి లోడ్ లారీలను ఢిల్లీకి పంపించడంతో అక్కడి వ్యాపారులు దాదాబాషా ఖాతాలో డబ్బులను జమచేస్తుం టారు. ఉదయం 11గంటలకు ఢిల్లీ వ్యాపారులు రూ.5లక్షలు ఖాతాలో వేశారు. దాదాబాషాకు మధ్యాహ్నం 2.15 గంటలకు రాజా అనే వ్యక్తి ఫోన్‌చేసి నీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పాడు. తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, దానిని సరిచేయడానికి నీ పిన్‌నంబర్ సరిచేయాలని కోడ్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీంతో పాషా నంబర్ చెప్పాడు. వెంటనే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా పాషా ఖాతాలో ఉన్న రూ.5లక్షలను రాజా తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఓ రైతు ఫోన్‌చేసి పాషాను బత్తాయి డబ్బులు కావాలని కోరడంతో ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లారు. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో నివ్వెరపోయి మేనేజర్‌ను సంప్రదించాడు. నీ ఖాతాలోని డబ్బులు నేషనల్ ఎలక్ట్రానిక్ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా రాజా ఖాతాలోకి వెళ్లాయని చెప్పాడు. తాను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదని ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఫిన్కోడ్ బ్లాక్ అయ్యిం దని, నంబర్ చెప్పాలంటే చెప్పానని వివరించడంతో పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏఎస్పీ గంగారామ్‌ను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే సీఐను పిలిచి సమస్యను వివరించాడు. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రదించిన సీఐ రూ.5లక్షలు రాజా ఖాతా నుంచి డ్రా కాకుండా బ్లాక్ చేయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజా పోలీసులు తనపై నిఘా వుంచారని అనుమానించి వెంటనే తిరిగి రూ.5లక్షలను పాషా ఖాతాలోకి జమచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బ్యాంకు ఖాతానంబర్లు, ఏటీఎం కార్డు నంబర్లుగానీ, కోడ్‌నంబర్లు గానీ ఎవరు అడిగినా చెప్పవద్దన్నారు. ఆన్లైన్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. తనకు 5లక్షల రూపాయలు ఇప్పించిన పోలీసులకు పాషా కృతజ్ఞతలు తెలిపారు.