ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. దీంతో అనికా హఠాన్మరణంపై గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.
మృతురాలు మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్‌లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment