పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు.
అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది.
అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు.
కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment