కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు | Heartwarming story: UP Newborn Baby Survive After Parents Through Him | Sakshi
Sakshi News home page

కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు

Published Fri, Nov 1 2024 7:22 PM | Last Updated on Fri, Nov 1 2024 7:58 PM

Heartwarming story: UP Newborn Baby Survive After Parents Through Him

ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.

ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో  కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్‌ లాలాలజపతి రాయ్‌ ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.

నరకం నుంచి రెండు నెలలకు.. 
కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.

ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు.  పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్‌ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించారు వైద్యులు. 

కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement