ఆర్థరైటిస్ రోగుల వ్యాయామానికి ‘స్మార్ట్’ పద్ధతి!
నా వయసు 65 ఏళ్లు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. అయినా వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్లు చెప్పారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ కదా! మరి అలాంటప్పుడు మేం ఎక్సర్‌సైజ్ చేయడం ఎలాగో సూచించండి.
- తాయారమ్మ, తుని
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమ ఎముకలు మరింత కాలం బలంగా ఉండాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే ఇంగ్లిష్ మొదటి అక్షరాలతో రూపొందిన ‘స్మార్ట్’ అనే విధానం పాటిస్తే వారి వ్యాయామ ప్రక్రియ తేలికవుతుంది. సూచనలు గుర్తుంచుకోవడం సులభమవుతుంది. స్మార్ట్‌లోని ఎస్, ఎమ్, ఏ, ఆర్, టీ... అంటే...
ఎస్ అంటే స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమకు అనువైన తేలికపాటి వ్యాయామాన్ని చాలా మెల్లగా ప్రారంభించాలి. ఉదాహరణకు రోజూ 3-5 నిమిషాలపాటు రోజుకు రెండుసార్లు తేలికపాటి వ్యాయామం చేయాలి. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడం సురక్షితం అన్నమాట.
ఎమ్ అంటే మాడిఫై యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్, ట్రై టు స్టే యాక్టివ్: ఆర్థరైటిస్ లక్షణాలు అంటే ప్రధానంగా కీళ్లలో నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇలా ఆర్థరైటిస్ లక్షణాలు తీవ్రమైనప్పుడు మన వ్యాయామ కార్యకలాపాలను లక్షణాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అంటే మనం వ్యాయామం చేసే వ్యవధి, ఎన్నిసార్లు, ఎంత తీవ్రంగా చేస్తామనే అంశాలను మార్చుకుంటూ ఉండాలి. ఇలా మార్పు చేసుకోవడం అన్నది లక్షణాలను తీవ్రతరం కాకుండా చూస్తుంది.
ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: అంటే మనం చేసే వ్యాయామాలు మన కీళ్ల ఆరోగ్యానికి మేలు చేసేవై ఉండాలి. ఉదాహరణకు నడక, సైక్లింగ్, నీళ్లలో చేసే తేలికపాటి వ్యాయామాలు. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల మన కీళ్లపై పడే శరీర బరువు తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలన్నమాట.
ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్ : ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుగా ఉండటం వల్ల అవి విరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యాయామం చేయడానికి సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీరు మీ లోకల్ పార్క్‌లో నడుస్తుంటే అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ పడిపోయేందుకు అవకాశం ఉండకూడదు. రాత్రివేళ వాకింగ్ చేస్తుంటే తగినంత లైట్ (వెలుగు) ఉండాలి.
టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : మీరు వ్యాయామాలు ప్రారంభించడానికి ముందుగా మంచి వ్యాయామ నిపుణుడినీ లేదా డాక్టర్‌ను అందునా ప్రత్యేకంగా జీవనశైలి నిపుణులతో మాట్లాడాలి. వారు మీకు అనువైన వ్యాయామ పద్ధతులను సూచిస్తారు. దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారికి అనువైన మార్గాలనూ, ఏదైనా అంగవైకల్యం ఉన్నవారు చేయాల్సిన వ్యాయామ రీతులను
వారు సూచిస్తారు.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్,
లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్