ఆర్థరైటిస్‌.. నడవలేం.. కదల్లేం | World Arthritis Day on October 12 | Sakshi
Sakshi News home page

ఆర్థరైటిస్‌.. నడవలేం.. కదల్లేం

Published Fri, Oct 12 2018 2:16 AM | Last Updated on Fri, Oct 12 2018 8:53 AM

World Arthritis Day on October 12 - Sakshi

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. అందులో ఆర్థరైటిస్‌ కూడా ఒకటి. అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత పదేళ్లలో ఆర్థరైటిస్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50–60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35–40 ఏళ్లలోనే చూస్తున్నాం. దీన్ని ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మున్ముందు నడవలేని, కదల్లేని పరిస్థితులు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒక్కోసారి ఎముకలు గుళ్లబారి విరిగిపోయే ప్రమాదమూ ఉంది. అక్టోబర్‌ 12న ప్రపంచ ఆర్థరైటిస్‌ దినం సందర్భంగా ఈ అంశంపై ‘సాక్షి’ కథనం.    – సాక్షి, హైదరాబాద్‌

ఆర్థరైటిస్‌ అంటే..?
కీళ్ల అరుగుదలనే ఆర్థరైటిస్‌ అంటాం. కీళ్ల నొప్పులు అధికంగా తుంటి, మోకాలులో వస్తుంటాయి. చేతి, మోచేతిలోనూ కీళ్ల నొప్పులు రావచ్చు. శరీరంలో మోకాలే పెద్ద కీలు. శరీర బరువును సగానికిపైగా మోకాలే మోస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లలో ఉండే కీలకమైన మృదులాస్థి అనే పదార్థం కరిగిపోతుంది. అది నిరంతరం కరుగుతూ మళ్లీ ఏర్పడుతుండటం దాని ప్రత్యేకత. అయితే 40–45 ఏళ్ల మధ్య మృదులాస్థి పునరుత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీంతో కీళ్లవాపు, నొప్పి, నడవలేకపోవడం వంటివి వస్తాయి. ఈ విధంగా జరగడాన్నే కీళ్ల నొప్పి లేదా ఆర్థరైటిస్‌ అంటారు.

జీవనశైలిలో మార్పుల కారణంగా..
కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయసు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్‌ వస్తుంది. గత దశాబ్ద కాలం నుంచి ఆర్థరైటిస్‌ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగినందున డాక్టర్ల వద్దకు వస్తున్నారు. కాబట్టి కేసుల సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది. గత పదేళ్లలో సాపేక్షికంగా ఆర్థరైటిస్‌ కేసులు పెరిగాయి. దానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పులే కారణం. వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్‌ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్‌ రావడాన్ని గమనిస్తున్నాం.

వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్థి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్‌ వస్తుంది. గతంలో 50–60 ఏళ్లకు మాత్రమే మోకాలి నొప్పులు వచ్చేవి. గత 10 ఏళ్లలో 35–40 ఏళ్ల మధ్యలోనూ మోకాలి నొప్పులు చూస్తున్నాం. కింద కూర్చోవడం వల్ల, సాధారణ మరుగుదొడ్లు వాడినా మోకాలి నొప్పులు వస్తాయి. వెస్ట్రన్‌ కమౌడ్‌ను వాడకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్‌ వస్తుంది.

ముందు నుంచీ కింద కూర్చోవడం, టీనేజీలోనే యోగా వంటి సాధనలు చేస్తే ఇక సరేసరి. లేకుంటే 35 దాటాక కింద కూర్చునే పద్ధతిని కొత్తగా మొదలుపెట్టడం, అదే వయసులో యోగా చేయడంలో భాగం గా కింద కూర్చోవడం వంటివి చేసినా ఈ సమస్య వస్తుంది. మునులు కింద కూర్చొనే ధ్యానం చేసేవారు. వారికి ఎటువంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ వాళ్లు అలా చేయడం వల్ల శరీరం మొత్తం అందుకు అలవాటు పడుతుంది.

ఇతర కీళ్ల నొప్పులు..
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, ఎంకైలోడింగ్‌ ఆర్థరైటిస్‌ అనే 2 రకాలున్నాయి. సాధారణ ఆర్థరైటిస్‌కు ఈ రెండూ భిన్నం. ఈ రెండింటిలో ఉపశాఖలుగా మరో 15 ఆర్థరైటిస్‌లు ఉన్నాయి. ఇవి రావడానికి జన్యుపరమైన కారణాలే అధికంగా ఉంటాయి. తల్లిదండ్రులకు లేకపోయినా వారి వంశంలో ఎవరికి ఉన్నా వచ్చే అవకాశం ఎక్కువ. వీరికి మోకాలు, భుజం, తుంటి తదితర చోట్ల ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి రక్త పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్‌ ఎలాగో ఈ 2 రకాల ఆర్థరైటిస్‌లు వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే.

ఒకసారి తగులుకుంటే వదిలిపెట్టవు. పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్‌ తదితర మందులు వాడటం వల్ల వీటిని నియంత్రించవచ్చు. ఇక సోరియాసిస్‌ కూడా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. రీటస్‌ డిసీజ్‌ అంటే కంటి చూపు మందగించడం ద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది. ఇలాంటి జబ్బులు వస్తే 20–30 ఏళ్లకే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ రావడానికి వయసుతో సంబంధంలేదు. ఇటీవల 16 ఏళ్ల టీనేజీ బాలుడికి ఆపరేషన్‌ చేశారు.


30 ఏళ్లు.. 3 కిలోమీటర్లు..
30 ఏళ్ల మనిషి రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి.. 8 గంటలు పనిచేయాలి. అప్పుడు మృదులాస్థి పునరుత్పత్తి జరిగి కీళ్ల నొప్పులు రావు. వ్యాయామం వారానికి కనీసం 3 రోజులు చేయాలి. పొగ తాగకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి తగ్గట్లు బరువుండాలి. ఆర్థరైటిస్‌ను ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా గుండెకు చేటు తెస్తుంది. అలాగే మెటబాలిజం తగ్గుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థరైటిస్‌ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఆర్థరైటిస్‌ 4 దశల్లో ఉంటుంది. పరీక్షలు చేయించుకుని అది ఏ దశలో ఉందో గుర్తించాలి.


నాలుగో దశలోనే ఆపరేషన్‌
ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కాళ్లు వంగిపోతాయి. బలహీనమై పోతాయి. ఎముకలు విరిగిపోతాయి. ఇలాంటి నాలుగో దశలోనే సాధారణంగా ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. వయసు ద్వారా వచ్చే కీళ్ల నొప్పులు సాధారణంగా 50–60 ఏళ్లలో కనిపిస్తుంటాయి. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, బాగా కష్టపడి పనిచేసే వాళ్లు నొప్పులు ఓర్చుకోగలరు. కాబట్టి వారికి కీళ్ల నొప్పుల తీవ్రత 60–70 ఏళ్ల తర్వాతే అర్థమవుతుంది. ఆడవారు ఎక్కువగా కింద కూర్చోవడం, పూజలు చేయడం వల్ల వారికి ఎక్కువగా కీళ్ల నొప్పులు వస్తాయి.
– డాక్టర్‌ దశరథరామారెడ్డి, చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, యశోద ఆస్పత్రి

ఆర్థరైటిస్‌ పెరగకుండా చూసుకోవాలి
కీళ్ల అరుగుదలను తగ్గించుకోవాలి. 20 శాతం అరుగుదల ఉంటే, దాన్ని పెరగకుండా చూసుకోవాలి. మృదులాస్థి పెరగడానికి మందులు ఇస్తారు. అవి వాడాలి. సైక్లింగ్, ఈత వంటివి చేయాలి. దీని వల్ల కీళ్లపై ప్రభావం చూపదు. నిర్ణీత మోతాదులో డాక్టర్ల సూచన మేరకు నడవవచ్చు. ఏదైనా సమతుల్యమైన శారీరక శ్రమ, వ్యాయామం అవసరం. ఆర్థరైటిస్‌ ప్రాథమిక దశలో ఉంటే మందులు మాత్రమే వాడాలి. అది ముదిరిపోయి నాలుగో దశకు వచ్చాకే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
– డాక్టర్‌ మురళీధర్, ఆర్థోపెడిక్‌ సర్జన్, యశోద ఆస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement