
రోజంతా తెగ ఆడుకున్నా.. ఎన్నిసార్లు ఎగిరి గంతేసినా.. అలసిపోయామన్న మాట మాత్రం పిల్లల నోటి వెంబడిరాదు. ఎందుకిలా? అన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆంథోని బ్లాజోవిచ్‌కు వచ్చింది. పిల్లల్లో ఉండే ఒకరకమైన కండరాలు నీరసించిపోవడాన్ని అడ్డుకోవడం మాత్రమే కాకుండా.. ఎంత తీవ్ర శ్రమ నుంచైనా ఇట్టే తేరుకోగలవిగా ఉంటాయని ఆంథోనీ చెబుతున్నారు. పెద్దలతోపాటు చిన్నవారు, శిక్షణ పొందిన క్రీడాకారులు.. వ్యాయామం చేసిన తరువాత మళ్లీ తేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో గుర్తించడం ద్వారా వీరు ఒక పరిశోధన చేశారు. పిల్లలు క్రీడాకారులుగా మారేందుకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆంథోని అంటున్నారు.
ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయస్కులు కొంతమందిని కొన్ని బృందాలుగా విడదీసి వారిచేత వేర్వేరు వ్యాయామాలు, సైక్లింగ్ వంటి శారీరక శ్రమ చేయించారు. ప్రతి విభాగంలోని పిల్లల శరీరాల్లో శక్తి ఎలా పుడుతోందో (రక్తంలోని ఆక్సిజన్‌ను వాడుకోవడం ఇలా అన్నమాట) గుర్తించారు. దీంతోపాటు గుండె కొట్టుకునే వేగం, ఆక్సిజన్ మోతాదులు, లాక్టేట్ విసర్జితమయ్యే వేగం వంటివాటిని పరిశీలించారు. మొత్తమ్మీద తేలింది ఏమిటంటే.. పిల్లలు గుండె వేగాన్ని చాలా వేగంగా నియంత్రించుకోగలుగుతున్నారని, లాక్టేట్ కూడా వారి శరీరాల్లోంచి వేగంగా బయటకు వెళ్లిపోతోందని ఆంథోని తెలిపారు. ఈ రెండు అంశాల వల్లనే ఎక్కువ శారీరక శ్రమ చేసినా అలసిపోకుండా ఉంటున్నారని, తొందరగా తేరుకోగలుగుతున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment