దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అంతర్జాతీయ సాంకేతిక సదస్సులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి ఆలోచనా ధోరణి కలగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేవరకద్ర మండలంలోని స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సాంకేతిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాలలోని సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఉత్పత్తులతో ప్రకృతికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు.
అందుకే కన్నుతో కెమెరా, చాపతో పడవ, పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టినట్లు చెప్పారు. సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నా రు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు విద్యనభ్యసిం చాలన్నారు. అలాంటి మార్పులలోని కీలకాంశాలను విద్యార్థుల వద్ద బోధకులు ప్రస్తావించడం వల్ల అవి వారిలో నూతనమైన ఆలోచనలను రేకెత్తించడానికి వీలుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి కాలుష్యరహిత ఉత్పత్తులను కనుగొనడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయత్నించాలన్నారు.
అలాగే మానవాళికి సమకూర్చే విధంగా వైద్య, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకోవడానికి కావలసిన పరికరాలను కనుగొనే మేధస్సును అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు వెళితే విద్యార్థులకు తప్పక విజయం వరిస్తుందన్నారు. జోర్డాన్ అల్‌బల్కా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అదనన్ అల్‌రాబీయా, సింగరేణి బొగ్గు గనుల ఎస్‌ఈ డాక్టర్ ఉజ్వల్ కుమార్ బెహరా, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎంవీ రమణారావు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్‌రే మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు నిరాశకు గురికావద్దన్నారు.
సాంకేతిక రంగంలో జరుగుతున్న పలు మార్పులను తెలియజేయడంతో పా టు పరిశోధనాపరంగా జరుగుతున్న ఉన్నతిని విద్యార్థులు పరస్పరం అవగాహన పరుచుకోవడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సుల వల్ల వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు పర్యటించి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేయడానికి వీలుంటుందన్నారు. ప్రస్తుత తరుణంలో భారతదేశానికి సాంకేతిక విద్యను పెం పొందించడం ఎంతో అవసరని చెప్పారు. ఇప్పటి ఆర్థికవ్యవస్థను పటిష్ట పరచాలంటే పారిశ్రామిక రంగాన్ని, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ విద్య చాలా అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పేపర్ ప్రజంటేషన్ సీడీని ఆవిష్కరించారు. మొదటిసారిగా కళాశాలకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోయంబత్తూర్ హిందూస్తాన్ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ ఏవీ సెంథిల్‌కుమార్, స్విట్స్ ప్రిన్సిపల్ జి.తిరుపతిరెడ్డి, కళాశాల అధ్యక్షుడు కె.సంపత్‌కుమార్, ఉపాధ్యక్షుడు పి,శ్రీరామ్‌రెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి నర్సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాలుష్యరహిత ఉత్పత్తులను కనిపెట్టాలి
Published Sat, Nov 30 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement