ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీఏఈపీసీ) ఈ వివరాలు వెల్లడించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 12 శాతానికి పైగా తగ్గాయి. వీటి విలువ రూ.14,190 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ రూ.16,154 కోట్లుగా ఉండడం గమనార్హం.
ల్యాబ్‌లో తయారైన వజ్రాల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం తగ్గి రూ.1,986 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో వీటి ఎగుమతుల విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. మే నెలకు సంబంధించి బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 7 శాతానికి పైగా పెరిగి రూ.5,705 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.5,318 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో రూ.1,173 కోట్లు విలువ చేసే వెండి ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.3,729 కోట్లతో పోలిస్తే 68 శాతం క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment