న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా
ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment