న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో మళ్లీ పడిపోయాయి. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఈ విలువ –2.15 శాతం క్షీణించింది. మార్చి (–0.66 శాతం) తరువాత ఎగుమతులు క్షీణతలోకి జారడం ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగితే, దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) మరింత తీవ్రమై, డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు కూడా అనిశ్చితిగా ఉండడం ఇక్కడ గమనార్హం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
♦ సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్ డాలర్లు. 2017 ఇదే నెలలో ఈ విలువ 28.56 బిలియన్ డాలర్లు.
♦ దిగుమతులు 10.45 శాతం పెరిగాయి. విలువ రూపంలో 37.9 బిలియన్ డాలర్ల నుంచి 41.9 బిలియన్ డాలర్లకు పెరిగింది.
♦ సెప్టెంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 13.98 బిలియన్ డాలర్లు. గడచిన ఐదు నెలల్లో ఇది కనిష్టస్థాయి. చమురు ధరలు తీవ్ర స్థాయిలో ఉన్నా... వాణిజ్యలోటు తగ్గడం గమనార్హం.
♦ సెప్టెంబర్‌లో ఎగుమతులకు సంబంధించి మంచి వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో పెట్రోలియం ప్రొడక్టులు, ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ కెమికల్స్, ఔషధ రంగాలు ఉన్నాయి.
♦ ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య ఎగుమతుల విలువలో 12.54% వృద్ధి నమోదయ్యింది. దిగుమతుల్లో వృద్ధి 16.16 శాతం. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వాణిజ్యలోటు 94.32 బిలియన్ డాలర్లు.
ఆందోళన అక్కర్లేదు...: కేంద్రం
‘2017 సెప్టెంబర్లో హై బేస్ ఎఫెక్ట్ వల్ల 2018 సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ తగ్గినట్లు గణాంకాలు వచ్చాయి. 2017 సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అసాధారణ రీతిలో 26%గా నమోదయ్యింది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు గడువు ముగింపు నేపథ్యంలో జరిగిన భారీ ఎగుమతులు దీనికి కారణం. తాజా గణాంకాలను తాత్కాలికమైన ధోరణిగానే పరిగణించవచ్చు. ఎగుమతులు మళ్లీ మంచి వృద్ధి రేటుకు చేరుకోవడం ఖాయం. అక్టోబర్ నుంచే ఈ పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో వృద్ధి ధోరణి మున్ముందూ కొనసాగుతుంది’ అని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.
మళ్లీ ‘జారుడు బల్ల’పై ఎగుమతులు!
Published Tue, Oct 16 2018 12:35 AM | Last Updated on Tue, Oct 16 2018 12:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment