
సాక్షి, న్యూఢిల్లీ: గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా వెల్లడించారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్ డాలర్లు) ఎగబాకింది.