
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో రూ.28,833 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధి అని జెమ్, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. చైనా, మధ్యప్రాచ్య మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో కట్, పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 32 శాతం ఎగసి రూ.19,582 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాలు 30 శాతం అధికమై రూ.5,829 కోట్లకు చేరుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తరువాత యూఏఈకి బంగారు ఆభరణాల ఎగుమతులు 45 శాతం దూసుకెళ్లాయి. స్వల్ప క్షీణత తరువాత తిరిగి మధ్యప్య్రాచ్య మార్కెట్ పుంజుకుంటోందని అనడానికి ఇదే నిదర్శనం’ అని వివరించింది.
కలిసి వస్తున్న చైనా మార్కెట్.. : ‘ప్రధానంగా యూఎస్‌కు ఎగుమతయ్యే రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాల విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 20 శాతం అధికం అయ్యాయి. కొన్ని నెలలుగా తిరోగమన వృద్ధి నమోదు చేసిన హాంగ్‌కాంగ్ ఇప్పుడు తిరిగి గాడిలో పడింది. చైనా మారెŠక్ట్ పుంజుకోవడం గొప్ప మెరుగుదలకు దారితీయవచ్చు. చైనాలో సగటు పొదుపు రేటు దాదాపు 40 శాతంగా ఉంది. పొదుపు విలువ లక్షల కోట్ల రూపాయలకు సమానం. సుదీర్ఘ లాక్‌డౌన్ వ్యవధి తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలో చూసిన విధంగా ’ప్రతీకార కొనుగోలు’కు అవకాశం ఉంది. ఫలితంగా వజ్రాలు, వజ్రాభరణాల పరిశ్రమలో వచ్చే ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నాం’ అని కౌన్సిల్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment