బీజింగ్: అమెరికా–చైనా మధ్య మొదలైన వాణిజ్య ఘర్షణలు ఎట్టకేలకు సమసిపోయాయి. ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులను చైనా గణనీయంగా పెంచడం ద్వారా ఆ దేశంతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్ల తగ్గింపునకు తోడ్పాటు అందిస్తుంది. వాషింగ్టన్‌లో రెండు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమయం పాటు జరిగిన రెండో దశ చర్చల అనంతరం భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడింది.
ఒకరిపై ఒకరు వాణిజ్య యుద్ధానికి ఇరుదేశాలు దిగరాదని నిర్ణయించాయి. ‘‘చైనా ప్రజల పెరుగుతున్న వినియోగ అవసరాలను తీర్చేందుకు, మెరుగైన ఆర్థికాభివృద్ధికి గాను అమెరికా ఉత్పత్తులు, సేవల కొనుగోళ్లను చైనా గణనీయంగా పెంచుతుంది’’ అని సంయుక్త ప్రకటన విడుదలైంది. దీనివల్ల అమెరికా వృద్ధి, ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలిచినట్టు ఆ ప్రకటన పేర్కొంది.
చైనా ఒక నెల రోజుల్లోపు తమ వాణిజ్య లోటును 100 బిలియన్ డాలర్ల మేర తగ్గించాలని, 2020 నాటికి 200 బిలియన్ డాలర్ల మేర తగ్గించకపోతే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులపై సుంకాల పెంపు చర్యలు కూడా తీసుకున్నాయి. వాణిజ్య లోటు తగ్గింపునకు చైనా అదనంగా దిగుమతులు చేసుకునేందుకు ముందుకు రావడంతో వివాదానికి ముగింపు పలికినట్టయింది.
ఒప్పందం విధి, విధానాల ఖరారుకు గాను అమెరికా ఓ బృందాన్ని చైనాకు పంపిస్తుంది. ఈ చర్చల్లో అమెరికా తరఫున ట్రెజరీ సెక్రటరీ టి.ముంచిన్, వాణిజ్య సెక్రటరీ విల్‌బర్ ఎల్.రాస్, చైనా తరఫున ప్రతినిధి ఉపాధ్యక్షుడు లీహీ నేతృత్వం వహించారు. చైనా నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులకంటే...అమెరికా నుంచి చైనాకు జరిగే దిగుమతులు తగ్గడంవల్ల అమెరికా వాణిజ్యలోటు పెరిగిపోయింది. దీంతో ట్రంప్ ట్రేడ్‌వార్‌కు తెరతీసారు.
ఇతర అంశాలపైనా అంగీకారం
తయారీ, సేవలకు సంబంధించి వాణిజ్యం మరింత పెంపొందించుకునేందుకు సానుకూల వాతావరణం కల్పించాలని నిర్ణయించాయి. మేథో సంపత్తి హక్కులను పరస్పరం గౌరవించుకోవాలని, సహకారం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఈ దిశగా చైనా తన చట్టాల్లో సవరణలు తీసుకువస్తుంది. ఇరువైపులా పెట్టుబడులకు ప్రోత్సాహంపై అంగీకారం కుదిరింది. ‘మేడ్ ఇన్ చైనా 2025’లో భాగంగా పరిశ్రమలకు ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని, ప్రతీకార చర్యలకు దిగరాదని అమెరికా డిమాండ్ చేసింది.
‘‘ఈ అంశాలపై అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తూ ఆర్థిక, వాణిజ్య ఆందోళనలను సత్వరమే పరిష్కరించుకోవాలని రెండు వైపులా అంగీకారం కుదిరింది’’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఈ చర్చలు ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగినట్టు లీ చైనా పత్రికకు తెలిపారు. అమెరికా మంత్రులతో కూడిన బృందం చైనాలో పర్యటించి, సహచర మంత్రులతో పటిష్ట ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉందన్నారు.
నెల క్రితం తమ దేశంలోకి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు చెందిన 128 ఉత్పత్తులపై చైనా సుంకాలు పెంచేందుకు ప్రతిపాదించింది. తమ దేశ వాణిజ్యలోటు తగ్గింపునకు చైనా చర్యలు తీసుకోకపోతే 50 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో 106 అమెరికా ఉత్పత్తులపై కొత్తగా 25శాతం టారిఫ్ విధిస్తామని చైనా సైతం ప్రతిగా హెచ్చరించింది. కానీ, ఇరు దేశాలు తమ ఆదేశాలను ఇంతవరకు అమలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment