
ఎగుమతులు యూ టర్న్
♦ 18 నెలల వరుస పతనం తర్వాత పెరుగుదల
♦ జూన్ నెలలో 1.27 శాతం వృద్ధి
♦ దిగివచ్చిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఏడాదిన్నర వరుస పతనం తర్వాత ఎగుమతులు పుంజుకున్నాయి. జూన్ నెలలో దేశీయ ఎగుమతుల్లో 1.27 శాతం వృద్ధి చోటు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల్లో ఎగుమతులు కలసివచ్చాయి. దీనికితోడు దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు సైతం దిగివచ్చింది.
♦ జూన్ నెలలో ఎగుమతులు 22.57 బిలియన్ డాలర్లు (రూ.1.51 లక్షల కోట్లు సుమారు)గా నమోదయ్యాయి. ఇది 1.27 శాతం పెరుగుదల. 2015 జూన్ నెలలో ఎగుమతులు 22.28 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
♦ దిగుమతుల్లో 7.33 శాతం క్షీణత చోటు చేసుకుంది. 2015 జూన్ నెలలో 33.11 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఈ ఏడాది జూన్ లో 30.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
♦ ఫలితంగా జూన్ నెలలో వాణిజ్య లోటు 8.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. ఈ లోటు అంతకుముందు ఏడాది ఇదే నెలలో 10.82 బిలియన్ డాలర్లుగా ఉంది.
♦ ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ తగ్గడం, చమురు ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి.
♦ పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 16.42 శాతం తగ్గాయి.
♦ బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. జూన్‌లో 1.20 బిలియన్ డాలర్ల మేర బంగారం దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.54 శాతం తగ్గినట్టు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తక్కువగానే...
♦ అయితే, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చూస్తే మొత్తం మీద ఎగుమతుల విలువ 65.31బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 జూన్ క్వార్టర్‌లో ఎగుమతులు 66.69 బిలియన్ డాలర్లు.