న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్‌లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు).
దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్‌కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం
గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
ఎగుమతుల విభాగం ఇలా...
► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్‌లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్‌లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం.
► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ.
► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది.
దిగుమతుల తీరిది
► క్రూడ్ దిగుమతుల విలువ జూన్‌లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది.
► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం.
మొదటి మూడు నెలల్లో
ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42
బిలియన్ డాలర్లు.
రెట్టింపు కరెంట్ అకౌంట్
వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్‌లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం.
– అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
Published Tue, Jul 5 2022 5:01 AM | Last Updated on Tue, Jul 5 2022 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment