ఉప ఎన్నికల ఫలితాలు చేదు వార్తల్ని మోసుకొచ్చిన రోజునే ఎన్‌డీఏ ప్రభుత్వాధినేతలకు ఆర్థిక రంగం నుంచి తీపి కబురు అందింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు భేషుగ్గా ఉన్నదని ఆ తీపి కబురు సారాంశం. తొలి త్రైమాసికంలో కేవలం 5.6 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఇప్పుడు 7.7 శాతానికి ఎగబాకిందంటే అది సహజంగానే కమలనాథులకు ఊరట కలిగించే అంశం. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముద్రపడ్డ చైనా ఇదే కాలానికి 6.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకున్నదని గుర్తుంచుకుంటే మన వృద్ధిరేటు వెలిగిపోతున్నట్టే చెప్పాలి. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కున్న హోదాను తాజా వృద్ధి రేటు నిలబెట్టింది.
వెనకా ముందూ చూడకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం వల్లా, జీఎస్‌టీ అమలు అస్తవ్యస్థంగా ఉండటం వల్లా ఆర్థిక రంగం గుడ్లు తేలేస్తున్న దని విపక్ష నేతలు, కొందరు ఆర్థిక రంగ నిపుణులు కోడై కూస్తుండగా ‘ఇక్కడంతా క్షేమమ’ని వృద్ధి రేటు చాటుతోంది. అయితే మొత్తంగా చూసుకుంటే అంతక్రితంనాటి వార్షిక వృద్ధి రేటు 7.1 శాతంతో పోలిస్తే 2017–18 వార్షిక వృద్ధి రేటు 6.7 శాతం మాత్రమే! కానీ వర్తమాన ఆర్ధిక సంవ త్సరం ముగిసేసరికల్లా వృద్ధిరేటు 7.5 శాతంగా నమోదవడం ఖాయమని కేంద్రం చాలా భరో సాతో ఉంది.
దీన్ని సాధించగలిగితే సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన వేళ అది తమకు లాభిం చగలదన్న విశ్వాసం కూడా వారికి ఉండొచ్చు. ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావ రణ విభాగం అంచనా వేస్తున్నది. అది వృద్ధి రేటుకు ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు వెలువడిన వృద్ధి రేటులో వ్యవసాయ రంగం వాటా 4.5 శాతం. నిర్మాణ రంగం 11.6 శాతంతో, తయారీ రంగం 9.1 శాతంతో దానికన్నా చాలా ముందం జలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా వర్షాలు పడి పంటలు పండితే వృద్ధి రేటు హెచ్చుతుం దని కేంద్రం లెక్కేయడం సహజమే.
గణాంకాలెప్పుడూ సామాన్యులను అయోమయంలో ముంచెత్తుతాయి. తాము బతికే బతుకుకూ, ఆ గణాంకాలు చెప్పేదానికీ అసలే పొంతన లేనప్పుడు ఈ అయోమయం మరిన్ని రెట్లు పెరుగుతుంది. వారికి సంబంధించినంతవరకూ సజావుగా పూట గడుస్తున్నదా లేదా, తమ కనీసా వసరాలు తీరుతున్నాయా లేదా అనేదే ప్రధానం. అవన్నీ బాగుంటే సరేసరి, లేకుంటే మాత్రం ‘భారత్ వెలిగిపోతున్నద’ని చెప్పినా, ‘అచ్ఛేదిన్ వచ్చేశాయ’ని ఊదరగొట్టినా వారు నమ్మరు గాక నమ్మరు. తాము అధికారంలోకొస్తే వృద్ధిరేటు మరింత పెరిగేలా చూస్తామని, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. అయితే చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటా ఉన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమ్మిళిత అభివృద్ధి సంగతలా ఉంచి, ప్రజానీకాన్ని సమస్యల్లోకి నెట్టింది.
చిన్నతరహా పరిశ్రమలు భారీయెత్తున మూతపడగా కార్మికులు ఉపాధి కరువై అలమటించారు. వ్యవసాయం మూలనపడి పనులు దొరక్క కూలీలు విలవిల్లాడారు. చిత్రమేమంటే ఆ త్రైమాసికంలో జీడీపీ 7 శాతంగా నమోదైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత పరోక్ష పన్నుల వసూళ్లు ముమ్మరం కావడం వల్లే అది సాధ్యమైందని ఆర్థిక నిపుణులు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాల నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలు కోకుండానే నిరుడు జూలైలో జీఎస్‌టీ అమలు ప్రారంభమైంది. కీలకమైన పన్ను సంస్కరణగా చెప్పిన ఆ చర్య ఏడాది కావస్తున్నా ఇంకా సమస్యలతో సతమతమవుతోంది.
అసలు దేశ ఆర్థికాభివృద్ధిని జీడీపీ ప్రాతిపదికన అంచనా కట్టడం సరైంది కాదన్న వాదనలు న్నాయి. ఒక ఏడాది వ్యవధిలో వ్యవసాయ, ఉత్పాదక, సేవా రంగాల్లో చట్టబద్ధంగా జరిగిన లావా దేవీలన్నిటి మారకపు విలువ ఆధారంగా ఈ జీడీపీని లెక్కేస్తారు. అయితే పోగవుతున్న సంపద ఎలా పంపిణీ అవుతున్నదన్నదే కీలకం. జీడీపీ బ్రహ్మాండంగా ఉన్నదని గణాంకాలు చెబుతున్నా ఎటువైపు చూసినా ఆర్థిక తారతమ్యాలు, ఉపాధి లేమి, జనం ఒడిదుడుకులు, సామాజిక రంగంలో అశాంతి, ప్రజారోగ్యం క్షీణత వంటివి కనబడుతుంటే సాధించామని చెప్పే ఆర్థికా భివృద్ధికి అర్థమే ముంటుంది? జనం రోగాల బారినపడి అప్పో సప్పో చేసి ఆరోగ్యానికి బాగా ఖర్చు పెడుతుంటే ఫార్మా రంగం బాగుంటుంది.
ఆసుపత్రులు బాగుంటాయి. కార్పొరేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో నెలజీతగాళ్లకు వేతనాలు భారీగా పెరిగి వారు వినియోగ వస్తువులకూ, విలాసాలకూ భారీగా ఖర్చు పెడితే ధారాళంగా డబ్బులు చేతులు మారి వేర్వేరు రంగాలు మంచి పనితీరును కనబరుస్తాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, పరపతి విస్తరణ తదితరాలు కళకళలాడతాయి. వీటన్నిటా జరిగే లావాదేవీల ఆధారంగా లెక్కేసే జీడీపీ
దేన్ని ప్రతిఫలిస్తున్నట్టు?
అయితే ఎన్ని సమస్యలున్నా ఇప్పటికీ మనది ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థేనని ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు చెబుతున్నాయి. వచ్చే మూడేళ్లలో అన్ని ప్రధాన దేశాలకంటే భారత్ వృద్ధే మెరుగ్గా ఉంటుందని ప్రపంచబ్యాంకు ఘంటాపథంగా అంటున్నది. అయితే రేటింగ్ సంస్థలు ఈ స్థాయిలో ఆశావహంగా లేవు. మూడీస్‌గానీ, గోల్డ్‌మాన్ శాక్స్ గానీ ఇంతకు ముందు తాము ఇచ్చిన అంచనాలను తగ్గించి చూపుతున్నాయి. మన దేశం ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ముడి చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఆశిస్తున్న 7.5 శాతం వృద్ధి రేటు అంత సులభమేమీ కాదు.
ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగిందంటే ద్రవ్యోల్బణం రేటు 30–40 బేస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా. అందువల్ల ఇతరేతర రంగాల పనితీరు ఎంత మెరుగ్గా ఉన్నా ముడి చమురు ధరలు దాన్ని మింగేస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రానికి ఈ చమురు గండం పెను సవాలే. జీడీపీ వృద్ధిరేటు, ఇతర గణాంకాల మాటెలా ఉన్నా క్షేత్రస్థాయిలో పెట్టే పెట్టుబడులు పెరిగేందుకూ, ఉద్యోగ కల్పనకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే తాము హామీ ఇచ్చిన ‘అచ్ఛేదిన్’ సాకారమవుతుందని పాలకులు గుర్తించాలి. రుతుపవనాలపై ఆధారపడి అంచనాలు పెంచుకోవడం, సేవారంగాల పనితీరును లెక్కేసి అంతా సవ్యంగా ఉంటుందనుకోవడం వృధా ప్రయాస.
Comments
Please login to add a commentAdd a comment