న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరిలో 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో వాణిజ్యలోటు 13.12 బిలియన్ డాలర్లు. క్రూడ్ దిగుమతుల బిల్లు భారం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ముఖ్య గణాంకాలు పరిశీలిస్తే, ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఏకంగా 69 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) 15.28 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
విభాగాల వారీగా...
- ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 9.65 శాతం తగ్గి 4.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- ఇక ఇంజనీరింగ్ గూడ్స్ (32 శాతం), పెట్రోలియం (88.14 శాతం), రసాయనాల (25.38 శాతం) విభాగాలు మంచి పురోగతితో విలువల్లో వరుసగా 9.32 బిలియన్ డాలర్లు, 4.64 బిలియన్ డాలర్లు, 2.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- ఫార్మా ఎగుమతుల విలువ 1.78 శాతం పడిపోయి 1.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరినా...
ఇక ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 46.09 శాతం పెరిగి 374.81 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 59.33 శాతం పెరిగి 550.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 2020–21 ఇదే కాలంతో పోలి్చచూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 88.99 బిలియన్ డాలర్ల నుంచి 175.75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశాలు ఉండడం కొంతసానుకూల అంశమైనా, క్రూడ్ ధరల వల్ల వాణిజ్యలోటు తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment