చైనా ఉత్పత్తుల కట్టడికి భారత్ కొత్త ఫార్ములా!
చైనా ఉత్పత్తుల కట్టడికి భారత్ కొత్త ఫార్ములా!
Published Wed, Nov 2 2016 10:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
న్యూఢిల్లీ : చైనాతో వాణిజ్యం లోటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ లోటును తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. మార్కెట్లో చైనా ఉత్పత్తుల ప్రవేశాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది. దీనికోసం ఓ కొత్త ఫార్ములాను సంధించాల్సిందేనని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చైనాకు డ్యూటీ రాయితీలను తగ్గించడం లేదా ఆలస్యం చేయడం ద్వారా ఆ దేశ ఉత్పత్తులను మార్కెట్లోకి రావడాన్ని అడ్డుకట్ట వేయొచ్చని భారత్ భావిస్తున్నట్టు సమాచారం. అయినా కూడా లాభంలేకపోతే, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ట్రేడ్ ఒప్పందం కింద దిగుమతయ్యే చైనా ఉత్పత్తుల నెగిటివ్ జాబితా తయారుచేసి, వాటికి టారిఫ్ రాయితీలను ఇవ్వకూడదని ప్లాన్ వేస్తోంది.
ఈ విషయాన్ని నవంబర్ 3-4వ తేదీన ఫిలిప్పీన్స్లో జరిగే మంత్రిత్వ శాఖల చర్చలో వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించనున్నారు. ఈ కొత్త కొత్త వ్యూహ్యాలతో చైనాతో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 2015-16లో భారత్ నుంచి చైనాకు 9 బిలియన్ డాలర్ల(రూ.60,117కోట్లు) ఎగుమతులు జరిగితే, ఆ దేశం నుంచి భారత్ 61.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4,14,314కోట్లు) దిగుమతులు చేసుకుంది. అంటే చైనాతో భారత్ వాణిజ్యలోటు 52.7(సుమారు రూ.3,54,172కోట్లు) బిలియన్ డాలర్లు. ఉత్పత్తులు, సర్వీసులు, పెట్టుబడులు, పోటీ, ఆర్థిక, సాంకేతిక సహకారాలతో వివాద పరిష్కారం, మేధో సంపత్తి హక్కుల్లో ఈ ఆర్సీఈపీ ఓ సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దీనిలో 16 దేశాలు భాగస్వామ్యమై ఉంటాయి. 10 ఆగ్నేయాషియా దేశాల అసోసియేషన్, ఆరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద భాగస్వాములు. ఈ ఆరింటిలో ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, కొరియా, న్యూజిలాండ్లు ఉన్నాయి.
Advertisement
Advertisement