new formula
-
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
లైసెన్సు లేదు.. ఫైన్ వేస్కోండి!
సాక్షి, అమరావతి : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా తమ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ అవ్వకుండా కొందరు వాహనాదారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎంతైనా ఫైన్ వేస్కోండి గానీ.. తమకు లైసెన్సు లేదంటూ ఎంచక్కా తప్పించుకుంటున్నారు. తమ తీరుతో రవాణా అధికారులను అవాక్కయ్యేలా చేస్తున్నారు. మితిమీరిన వేగం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. లైసెన్సు సస్పెండ్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలిచ్చింది. దీంతో రవాణా శాఖ సస్పెన్షన్లపై గురి పెట్టింది. ఇప్పటివరకు 20 వేల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు అసలు తమకు లైసెన్సే లేదని చెబుతున్నారు. గతేడాది రవాణా శాఖ అధికారులు జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 78,130 మంది తమకు డ్రైవింగ్ లైసెన్సులు లేవని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు గణాంకాలుండగా.. ప్రతి వంద మందిలో 70 మంది లైసెన్సు లేదని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కయ్యారు. ‘డ్రైవింగ్ లైసెన్సు లేదని చెబితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందంటే.. ఏకంగా ఆ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల మా ఉపాధి దెబ్బతింటోంది. అదే లైసెన్సు లేదని చెబితే ఉల్లంఘనలకు గానూ రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా చెల్లించి తప్పించుకోవచ్చు..’ అని వాహనదారులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సులను లింక్ చేస్తున్నామని.. దీంతో అసలు విషయం తేలిపోతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా డ్రైవింగ్ లైసెన్సులు లేని వారి సంఖ్య అనంతపురం 6,426 చిత్తూరు 5,543 వైఎస్సార్ 1,909 కర్నూలు 7,014 నెల్లూరు 5,311 ప్రకాశం 2,483 గుంటూరు 4,233 కృష్ణా 10,593 పశ్చిమగోదావరి 9,209 తూర్పుగోదావరి 12,755 విశాఖపట్నం 6,541 శ్రీకాకుళం 2,198 విజయనగరం 3,915 మొత్తం 78,130 -
చైనా ఉత్పత్తుల కట్టడికి భారత్ కొత్త ఫార్ములా!
న్యూఢిల్లీ : చైనాతో వాణిజ్యం లోటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ లోటును తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. మార్కెట్లో చైనా ఉత్పత్తుల ప్రవేశాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది. దీనికోసం ఓ కొత్త ఫార్ములాను సంధించాల్సిందేనని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చైనాకు డ్యూటీ రాయితీలను తగ్గించడం లేదా ఆలస్యం చేయడం ద్వారా ఆ దేశ ఉత్పత్తులను మార్కెట్లోకి రావడాన్ని అడ్డుకట్ట వేయొచ్చని భారత్ భావిస్తున్నట్టు సమాచారం. అయినా కూడా లాభంలేకపోతే, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ట్రేడ్ ఒప్పందం కింద దిగుమతయ్యే చైనా ఉత్పత్తుల నెగిటివ్ జాబితా తయారుచేసి, వాటికి టారిఫ్ రాయితీలను ఇవ్వకూడదని ప్లాన్ వేస్తోంది. ఈ విషయాన్ని నవంబర్ 3-4వ తేదీన ఫిలిప్పీన్స్‌లో జరిగే మంత్రిత్వ శాఖల చర్చలో వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించనున్నారు. ఈ కొత్త కొత్త వ్యూహ్యాలతో చైనాతో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 2015-16లో భారత్ నుంచి చైనాకు 9 బిలియన్ డాలర్ల(రూ.60,117కోట్లు) ఎగుమతులు జరిగితే, ఆ దేశం నుంచి భారత్ 61.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4,14,314కోట్లు) దిగుమతులు చేసుకుంది. అంటే చైనాతో భారత్ వాణిజ్యలోటు 52.7(సుమారు రూ.3,54,172కోట్లు) బిలియన్ డాలర్లు. ఉత్పత్తులు, సర్వీసులు, పెట్టుబడులు, పోటీ, ఆర్థిక, సాంకేతిక సహకారాలతో వివాద పరిష్కారం, మేధో సంపత్తి హక్కుల్లో ఈ ఆర్సీఈపీ ఓ సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దీనిలో 16 దేశాలు భాగస్వామ్యమై ఉంటాయి. 10 ఆగ్నేయాషియా దేశాల అసోసియేషన్, ఆరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద భాగస్వాములు. ఈ ఆరింటిలో ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, కొరియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. -
విజయం: పట్టా లేని శాస్త్రవేత్త!
ఓ కొత్త కారు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి. ఇంజినీర్లను పెట్టుకోవాలి. వాళ్లు నిరంతరం పరిశోధనలు చేసి ఓ కొత్త ఫార్ములా కనుక్కోవాలి. దానికి మెరుగులు దిద్దాలి! ఆ తర్వాత పేటెంట్ సంపాదించాలి. దాన్ని లాంచ్ చెయ్యాలి! కానీ ఇంటర్మీడియట్ కూడా చదవని వ్యక్తి.. ఎవరి సాయం తీసుకోకుండా ఒక్కడే ఓ కొత్త తరహా కారు తయారు చేస్తే.. అద్భుతం కదా! ఆ అద్భుతమైన వ్యక్తి అస్సాంకు చెందిన కనక్ గొగోయ్. అతను డిగ్రీలు లేని విజేత! మధ్యతరగతి కుటుంబానికి చెందిన కనక్ గొగోయ్ పదో తరగతి పూర్తయ్యాక కళాశాలలో చేరాడు కానీ.. కుటుంబ పరిస్థితులు, అనాసక్తి వల్ల కొన్ని రోజుల్లోనే చదువు మానేశాడు. వెంటనే పాల వ్యాపారం మొదలెట్టి చేతులు కాల్చుకున్నాడు. తాను ఇష్టపడే మెకానిక్ పనిలో చేరాడు. అందరు మెకానికుల్లా బైకులు రిపేర్ చేసుకుంటూ కాలం గడిపేయకుండా ప్రయోగాలు మొదలుపెట్టాడు. పాత బైకులకు సంబంధించిన సామగ్రిని కలిపి కొత్త బైకులు తయారు చేశాడు. అతి తక్కువ పెట్టుబడితో, నిర్వహణ ఖర్చుతో వాహనాలు రూపొందించడంపైకి అతని దృష్టిమళ్లింది. ఐతే దీనికి ఎక్కువ ఖర్చవుతుందని భావించి గౌహతిలో సొంతంగా గ్యారేజీ పెట్టాడు. అది ఫలితాన్నిచ్చి కనక్కు చేతికి కాస్త డబ్బులొచ్చాయి. అవే అతని ప్రయోగాలకు పెట్టుబడి అయ్యాయి. ఎవరి ప్రోత్సాహం లేకున్నా, ఎవరూ సాయం చేయకున్నా... ఒంటరిగానే రాత్రింబవళ్లు కష్టపడి వినూత్నమైన వాహనాలు తయారు చేశాడు కనక్. అతని మొదటి ఉత్పత్తి.. గురుత్వాకర్షణతో పనిచేసే సైకిల్. దీన్ని తొక్కనక్కర్లేదు. స్ప్రింగు అమర్చిన సీటుపై కూర్చుని, పైకి కిందికి ఊగితే అది ముందుకెళ్తుంది. తర్వాతి తయారీ ట్రైగో-ఎక్స్ అనే చిన్న బైక్. తన కూతురు కోసం తయారు చేశాడు. సైకిల్ తరహాలో ఉండే ఈ బైక్ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. తర్వాత సోలార్-గ్యాస్ హైబ్రిడ్ కారు తయారు చేశాడు. ఒకసారి సోలార్ చార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్లు నడుస్తుందీ కారు. పెట్రోలుతో కూడా నడిపించొచ్చు. ఇక కనక్ తయారుచేసిన వాటిలో అతనికి అత్యంత ఇష్టమైన వాహనం.. కంప్రెస్డ్ కార్. మోటార్‌సైకిళ్లలోని కొన్ని పరికరాలు, మారుతి కార్ ఇంజిన్ కలిపి తయారు చేశాడు. ఇది 120 కి.మీ. వేగంతో వెళ్తుంది. దీనికి ఏసీ అమర్చలేదు. కారు వేగం పెరిగే కొద్దీ కారు నుంచే చల్లని గాలి వచ్చే ఏర్పాటు చేశాడు. ఇవే కాక ఏరో బోట్, ఏరో ప్రాపెల్లర్, నీళ్లలో నడిచే సైకిల్, ట్రెడ్మిల్ బైక్ వంటి వాహనాలు రూపొందించాడు కనక్. అతను తయారు చేసిన స్పీడ్ బ్రేకర్ అన్నింటికంటే విశిష్టమైనది. ఈ రెడీమేడ్ స్పీడ్ బ్రేకర్‌పై వాహనాలు వెళ్తే విద్యుదుత్పత్తి అవుతుంది! కనక్ గొగోయ్ సృష్టించిన బ్యాటరీతో నడిచే కారు. గత పదేళ్లుగా కనక్ ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆదాయాన్నంతా ప్రయోగాలకే ఖర్చు చేశాడు. ఆ ఖర్చు కోటి రూపాయలు దాటింది. తనకు పేటెంట్ హక్కుల గురించి కూడా పెద్దగా తెలియదని, ఇప్పటిదాకా తాను తయారు చేసిన వాహనాలకు సంబంధించి ఎలాంటి హక్కులూ సంపాదించలేదని చెబుతున్నాడు కనక్. తానింత చేస్తున్నా ప్రభుత్వం నుంచి కానీ, కార్పొరేట్ సంస్థల నుంచి కానీ పెద్దగా ప్రోత్సాహం లభించట్లేదంటాడు కనక్. టాటా మోటార్స్‌కు తన ప్రయోగాల గురించి వివరిస్తూ ఓ లేఖ రాశాడతను. ఆర్థిక సాయం అందిస్తే ప్రజల కోసం చౌక ధరల్లో వాహనాలు తయారు చేయవచ్చని చెప్పాడు. కానీ వారి నుంచి స్పందన రాలేదు. అవార్డులైతే వచ్చాయి కానీ.. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ప్రోత్సాహం దక్కలేదు. ఐతే విదేశాల్లోని కొన్ని సంస్థలు, యూనివర్శిటీలు అతణ్ని తమతో తీసుకెళ్లాయి. అక్కడ సెమినార్లు, వర్క్‌షాపుల్లో ప్రసంగించే అవకాశం కల్పించాయి. స్వదేశంలో తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తానంటున్నాడు కనక్. ‘‘విదేశాల నుంచి తమ కంపెనీల్లో పనిచేయాలని నాకు రెండు మూడు ఆహ్వానాలు అందాయి. నా ఆలోచనలన్నీ వారితో పంచుకుంటే జీతం వస్తుంది కానీ.. ఏ ఉత్పత్తిపైనా నాకు హక్కులు రావు. మన దేశంలోనే ఉండి, సామాన్యులకు ఉపయోగ పడేలా చౌక ధరల్లో వాహనాలు తయారు చేయాలన్నది నా లక్ష్యం’’ అంటాడు గొగోయ్. - ప్రకాష్ చిమ్మల