న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చిలో రికార్డు సృష్టించాయి. 58.23 శాతం పెరుగుదలతో 34 బిలియన్ డాలర్లుకు చేరాయి. ఒక నెల్లో ఎగుమతులు 34 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం భారత్ ఎగుమతుల చరిత్రలోనే ఇదే తొలిసారి. ఎగుమతుల పురోగతికి కేంద్రం తీసుకున్న పలు చర్యల ఫలితాలు మార్చిలో కనబడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక దిగుమతులు సైతం 52.89 శాతం పెరుగుదలతో 48.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 14.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020 మార్చి నెలలో ఎగుమతులు, దిగుమతులు అసలు వృద్ధి లేకుండా క్షీణతలో ఉన్న సంగతి తెలిసిందే.
అప్పటి అతి తక్కువ గణాంకాలే తాజా సమీక్షా నెలలో వృద్ధి పెరుగుదల శాతాల్లో ‘భారీ’గా కనబడ్డానికి కారణం. దీనినే బేస్ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చి నెలలో ఎగుమతుల విలువ 34 శాతం క్షీణించి (2019 మార్చితో పోల్చి) 21.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 2020 మార్చిలో 31.47 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్పట్లో వాణిజ్యలోటు 9.98 బిలియన్ డాలర్లు. వాణిజ్యమంత్రిత్వశాఖ తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, తాజా సమీక్షా నెలలో ఇంజనీరింగ్, రత్నాలు-ఆభరణాలు, ఔషధ రంగాల నుంచి ఎగుమతులు సానుకూల వృద్దిని నమోదుచేశాయి. పసిడి దిగుమతులు సమీక్షా నెలలో 7.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఆర్థిక సంవత్సరం 7.4 శాతం క్షీణత
కాగా 2020-21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019-20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతులు 18 శాతం క్షీణించి 474.71 బిలియన్ డాలర్ల నుంచి 388.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి.
చమురు దిగుమతుల విలువలు...
మార్చిలో చమురు దిగుమతుల విలువ 1.22 శాతం పెరిగి 10.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 37 శాతం పడిపోయి 82.25 బిలియన్ డాలర్లుగా ఈ విలువ నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ మార్చిలో ఏకంగా 777.12 శాతం పెరిగి 37.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
ఎగుమతుల బాట...
కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్-నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్‌లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. వరుసగా రెండవనెలా 2021 జనవరిలోనూ వృద్ధిబాటలో పయనించాయి. 6.16 శాతం వృద్ధితో 27.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఫిబ్రవరి నెలలోనూ భారత్ ఎగుమతులు వరుసగా మూడవనెలా పురోగతి బాటనే నడిచాయి. 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి.
కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ మార్చి 31వరకూ అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్‌టీపీ) మరో ఆరు నెలలు (సెప్టెంబర్ వరకూ) పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015-20 మధ్య అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని 2020 మార్చి 31వ తేదీన కేంద్రం 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగించింది. కొత్త పాలసీ విధాన రూపకల్పన పక్రియ ఇంకా చర్చల దశలోనే ఉందని, ఈ నేపథ్యంలో మరికొద్ది నెలలు ఇందుకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించవచ్చని ఇప్పటికే వచ్చిన వార్తలకు అనుగుణంగా బుధవారం ఎఫ్‌టీపీ పొడిగింపు (సెప్టెంబర్ వరకూ) అధికారిక నిర్ణయం వెలువడింది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితి అనిశ్చితిగా ఉందని, పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాజా విధాన రూపకల్పన, అమలు మంచి ఫలితాలను అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వాణిజ్య వర్గాలు సమర్థిస్తున్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment