
వాణిజ్యలోటు.. ఆందోళన!
జూలైలో భారీగా 11.44 బిలియన్ డాలర్లు
► భారీ పసిడి దిగుమతుల ప్రభావం
► ఎగుమతులు 8 నెలల కనిష్ట స్థాయి
► భారీగా పెరిగిన దిగుమతుల విలువ
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు జూలైలో భారీగా పెరిగింది. ఈ మొత్తం భారీగా 11.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అధిక పసిడి దిగుమతుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. అయితే 2017 జూన్‌తో (12.96 బిలియన్ డాలర్లు) పోల్చితే వాణిజ్యలోటు తక్కువ.
ఎగుమతులు 3.94 శాతం అప్...
జూలైలో ఎగుమతుల వృద్ధి కేవలం 3.94 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. విలువ రూపంలో 2016 జూలైలో 21.68 బిలియన్ డాలర్లయితే, 2017 జూలైలో ఈ విలువ కేవలం 22.54 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూలై నెలలో ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, రెడీ–మేడ్ దుస్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకాకపోగా, క్షీణత నెలకొంది. ఈ కీలక రంగాల్లో ఎగుమతులు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గణేష్ గుప్తా పేర్కొన్నారు. అయితే ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాలు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి.
దిగుమతులు 15.42 శాతం పెరుగుదల
ఇక దిగుమతులు భారీగా 15.42 శాతం పెరిగాయి. విలువ రూపంలో 29.45 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 11.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
పసిడి దిగుమతులు 95 శాతం పైకి...
ఇక పసిడి దిగుమతులు 95 శాతం పెరిగాయి. వార్షికంగా ఈ విలువ 1.07 బిలియన్ డాలర్ల నుంచి 2.19 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది కరెంట్ అకౌంట్‌లోటు (దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై ప్రతికూల ప్రభావం చూపే అంశం.
చమురు దిగుమతులూ భారీనే..
ఇక జూలైలో క్రూడ్ దిగుమతులు భారీగా జరిగాయి. వార్షికంగా 15 శాతం వృద్ధితో 7.84 బిలియన్ డాలర్లుగా ఈ విలువ నమోదయ్యింది. ఇక మిగిలినవి పసిడిసహా చమురు యేతర దిగుమతులు.
నాలుగు నెలల్లో చూస్తే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే... ఎగుమతులు 8.91 శాతం వృద్ధితో 94.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 28.30% వృద్ధితో 146.25 బిలియన్ డాలర్లగా ఉంది. దీనితో వాణిజ్య విలువ ఈ కాలంలో 51.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.