
ముంబై: అటు ఎగుస్తున్న ముడి చమురు ధరలు... ఇటు పెరుగుతున్న వాణిజ్య లోటు మొదలైన అంశాల దెబ్బతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం ఏకంగా 52 పైసలు క్షీణించి 66.90 స్థాయికి పతనమైంది. ఒకే రోజు ఈ స్థాయిలో పడిపోవడం ఈ ఏడాది ఇది మూడోసారి. అలాగే, ఇది 14 నెలల కనిష్టం కూడా. చివరిసారిగా 2017 ఫిబ్రవరి 22 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. కార్పొరేట్లు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొనడంతో దేశీ కరెన్సీ గణనీయంగా క్షీణించింది.
ఒక దశలో ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నట్లుగా కనిపించినప్పటికీ.. పతనానికి అడ్డుకట్ట పడలేదు. మొత్తంమీద గతేడాది ఆరు శాతం పైగా బలపడిన రూపాయి.. ఈ ఏడాది మాత్రం ఆసియా కరెన్సీలన్నింటిలోకెల్లా అత్యధికంగా క్షీణించింది. అటు పౌండు, యూరో, జపాన్ యెన్‌తో పోల్చి చూసినా రూపాయి బలహీనంగా క్లోజయ్యింది.