న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై వాణిజ్యలోటు భారం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఒక దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇది జూలైలో 18 బిలియన్ డాలర్లపైన నమోదయ్యింది. గడచిన ఐదేళ్లలో ఈ స్థాయి వాణిజ్యలోటు ఎప్పుడూ నమోదుకాలేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే...
జూలైలో భారత్ ఎగుమతులు 14.32% పెరిగి (2017 ఇదే నెలతో పోల్చి) 25.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 22.54 బిలియన్ డాలర్లు. రత్నాలు, ఆభరణాలు (24.62% వృద్ధితో 3.18 బిలియన్ డాలర్లకు), పెట్రోలియం ఉత్పత్తుల (3 బిలియన్ల డాలర్ల నుంచి 3.9 బిలియన్ల డాలర్లకు) ఎగుమతులు భారీగా పెరిగాయిఇక దిగుమతులు 28.81 శాతం పెరిగి 33.99 బిలియన్ డాలర్ల నుంచి 43.79 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
దీనితో ఈ రెండింటి మధ్యా నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2017 జూలైలో ఈ లోటు 11.45 బిలియన్ డాలర్లు.బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ మెటల్ దిగుమతులు 2.102 బిలయన్ డాలర్ల నుంచి 2.96 బిలియన్ల డాలర్లకు ఎగశాయి. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు వార్షికంగా 53.16 శాతం పెరిగాయి. దీనితో భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే చమురు దిగుమతుల బిల్లు 57 శాతం పెరిగి 12.35 బిలియన్ డాలర్లకు చేరింది.
నాలుగు నెలల్లో...
కాగా 2018 ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 94.76 బిలియన్ డాలర్ల నుంచి 14.23% వృద్ధితో 108.24 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 17% వృద్ధితో 146.26 బిలియన్ డాలర్ల నుంచి 171.20 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. సేవల ఎగుమతుల్లో స్వల్ప పెరుగుదల కాగా, జూన్ నెలలో దేశీయంగా ఎగుమతుల విలువ 0.89 శాతం పెరిగి (2017 జూన్ నెలతో పోల్చి చూస్తే) 10.3 బిలియన్ డాలర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment