ఎగుమతుల లక్ష్యం మిస్... | India misses export target in FY15; annual exports dip 1.23% | Sakshi
Sakshi News home page

ఎగుమతుల లక్ష్యం మిస్...

Published Sat, Apr 18 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

ఎగుమతుల లక్ష్యం మిస్...

ఎగుమతుల లక్ష్యం మిస్...

2014-15లో లక్ష్యం 340 బిలియన్ డాలర్లు  
జరిగింది 311 బిలియన్ డాలర్లే
మార్చిలో భారీగా పెరిగిన వాణిజ్య లోటు  
బంగారం దిగుమతుల పెరుగుదల ఎఫెక్ట్

న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్-2015 మార్చి) తీవ్ర నిరుత్సాహ పరిచాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.

దీని ప్రకారం  340 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని ఎగుమతుల రంగం చేరుకోలేకపోయింది.  కనీసం 2013-14 ఆర్థిక సంవత్సరం పరిమాణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 314 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 311 బిలియన్ డాలర్ల వద్ద చతికిలపడిపోయాయి. అంటే వార్షికంగా చూసుకుంటే అసలు వృద్ధి లేకపోగా(-) 1.23 శాతం క్షీణించాయన్నమాట. ఇక వార్షికంగా దిగుమతులు - 0.5 శాతం క్షీణించి 450 బిలియన్ డాలర్ల నుంచి 448 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల వ్యత్యాసం వాణిజ్యలోటు ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్లుగా ఉంది.
 
మార్చిలో భారీ వాణిజ్య లోటు
మార్చి నెల విదేశీ వాణిజ్యానికి సంబంధించి, ఈ నెలలో భారీ వాణిజ్యలోటు ఏర్పడింది.  వార్షికంగా (2014 మార్చితో పోల్చి) ఎగుమతులు 21 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఎగుమతుల రేటు పడిపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి.  దిగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే- 13 శాతంపైగా తగ్గి 36  బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.  దీనితో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఈ లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయి.

2014 మార్చిలో వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ లోటు 7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ నుంచీ ఎగుమతుల రంగం క్షీణ దశలో ఉంది.  పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మార్చి నెలలో 59.5 శాతం తగ్గాయి. రత్నాలు, ఆభరణాల విలువ 8.36 శాతం తగ్గింది. రసాయనాల ఎగుమతుల విలువ 5.36% పడింది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 2.5% తగ్గాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు విభాగాల ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం.
 
భారీగా పెరిగి పసిడి దిగుమతులు...
మార్చిలో వాణిజ్యలోటు పెరగడానికి దేశంలోకి బంగారం భారీ దిగుమతులు ఒక కారణం. 2014 మార్చి నెలతో పోల్చితే పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
 
కలిసి వచ్చిన చమురు...
ఇక చమురు దిగుమతుల విలువ 53% క్షీణించడం విశేషం. ఈ విలువ మార్చిలో 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినా... చమురు దిగుమతుల విలువ 16% పైగా తగ్గి 138 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. ఇక చమురు యేతర దిగుమతుల విలువ 8.4% పెరిగి 310 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
 
ప్రత్యేక దృష్టి అవసరం: నిపుణులు

ఎగుమతుల రంగం మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరమని భారత్ ఉత్పత్తుల ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) డెరైక్టర్ జనరల్ అజయ్ సాహీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement