ఎగుమతుల లక్ష్యం మిస్...
⇒ 2014-15లో లక్ష్యం 340 బిలియన్ డాలర్లు
⇒ జరిగింది 311 బిలియన్ డాలర్లే
⇒ మార్చిలో భారీగా పెరిగిన వాణిజ్య లోటు
⇒ బంగారం దిగుమతుల పెరుగుదల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్-2015 మార్చి) తీవ్ర నిరుత్సాహ పరిచాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
దీని ప్రకారం 340 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని ఎగుమతుల రంగం చేరుకోలేకపోయింది. కనీసం 2013-14 ఆర్థిక సంవత్సరం పరిమాణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 314 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 311 బిలియన్ డాలర్ల వద్ద చతికిలపడిపోయాయి. అంటే వార్షికంగా చూసుకుంటే అసలు వృద్ధి లేకపోగా(-) 1.23 శాతం క్షీణించాయన్నమాట. ఇక వార్షికంగా దిగుమతులు - 0.5 శాతం క్షీణించి 450 బిలియన్ డాలర్ల నుంచి 448 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల వ్యత్యాసం వాణిజ్యలోటు ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్లుగా ఉంది.
మార్చిలో భారీ వాణిజ్య లోటు
మార్చి నెల విదేశీ వాణిజ్యానికి సంబంధించి, ఈ నెలలో భారీ వాణిజ్యలోటు ఏర్పడింది. వార్షికంగా (2014 మార్చితో పోల్చి) ఎగుమతులు 21 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఎగుమతుల రేటు పడిపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. దిగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే- 13 శాతంపైగా తగ్గి 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఈ లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయి.
2014 మార్చిలో వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ లోటు 7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ నుంచీ ఎగుమతుల రంగం క్షీణ దశలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మార్చి నెలలో 59.5 శాతం తగ్గాయి. రత్నాలు, ఆభరణాల విలువ 8.36 శాతం తగ్గింది. రసాయనాల ఎగుమతుల విలువ 5.36% పడింది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 2.5% తగ్గాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు విభాగాల ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం.
భారీగా పెరిగి పసిడి దిగుమతులు...
మార్చిలో వాణిజ్యలోటు పెరగడానికి దేశంలోకి బంగారం భారీ దిగుమతులు ఒక కారణం. 2014 మార్చి నెలతో పోల్చితే పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
కలిసి వచ్చిన చమురు...
ఇక చమురు దిగుమతుల విలువ 53% క్షీణించడం విశేషం. ఈ విలువ మార్చిలో 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినా... చమురు దిగుమతుల విలువ 16% పైగా తగ్గి 138 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. ఇక చమురు యేతర దిగుమతుల విలువ 8.4% పెరిగి 310 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
ప్రత్యేక దృష్టి అవసరం: నిపుణులు
ఎగుమతుల రంగం మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరమని భారత్ ఉత్పత్తుల ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్ అజయ్ సాహీ అభిప్రాయపడ్డారు.