చైనా అమెరికాను ‘రేప్’ చేస్తోంది: ట్రంప్
షికాగో: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చైనాపై విరుచుకుపడ్డారు. చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోందని ధ్వజమెత్తారు. చైనా వాణిజ్యాన్ని అమెరికా వాణిజ్యంతో పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే చైనా అత్యాచారాలను కొనసాగనివ్వనని చెప్పారు.
ఆదివారం ఇండియానాలోని ఫోర్ట్ వేన్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో చైనా ఎగుమతులు పెరిగిపోయాయంటూ కరెన్సీ అంశంలో చైనా చేస్తున్న మాయాజాలాన్ని తప్పుబట్టారు. ప్రపంచమార్కెట్‌లో తన ఉత్పత్తులను విక్రయించి ఎగుమతులు పెంచుకునేందుకు చైనా తన కరెన్సీపై గిమ్మిక్కులకు పాల్పడుతోందని, అమెరికా వాణిజ్యాన్ని దారుణంగా హత్యచేస్తోందన్నారు.