వాణిజ్యలోటు జూమ్!
నవంబర్‌లో ఏడాదిన్నర గరిష్ట స్థాయి
16.8 బిలియన్ డాలర్లుగా నమోదు
న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు నవంబర్‌లో భారీగా పెరిగింది. ఇది 16.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సోమవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్‌లో ఎగుమతులు 2013 ఇదే నెలతో పోల్చిచూస్తే, 7.27 శాతం వృద్ధితో 25.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దిగుమతులు ఇదే నెలలో 26.79 శాతం పెరుగుదలతో 42.82 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితం దేశానికి 16.8 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఇది దాదాపు ఏడాదిన్నర గరిష్ట స్థాయి. అక్టోబర్‌లో ఈ లోటు 13.4 బిలియన్ డాలర్లు. 2013 నవంబర్‌లో ఈ పరిమాణం 9.2 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా నెల నవంబర్‌లో చమురు దిగుమతులు 9.7 శాతం తగ్గి, 11.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చమురుయేతర దిగుమతుల విలువ 49.6 శాతం వృద్ధితో 31.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఎనిమిది నెలల్లో...
కాగా 2014 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ గడిచిన ఎనిమిది నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల విలువ 5.02 శాతం వృద్ధితో 215.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 4.65 శాతం వృద్ధితో 316.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 100.61 బిలియన్ డాలర్లుగా ఉంది.