ఎగుమతుల మార్కెట్ లో మన వాటాను కాపాడుకోవాలి!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ తొలుత తన ఎగుమతుల వాటాను పరిరక్షించుకోడానికి కృషి చేయాలని, అటు తర్వాత వృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పేర్కొన్నారు. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వివిధ మార్పులకు గురవుతున్న ఎగుమతుల రంగంలో మన వాటా పరిరక్షణకు విభిన్న వ్యూహాలను అవలంభించాల్సి ఉంటుందని అన్నారు. ధర, నాణ్యతా ప్రమాణాలు, ఒప్పందాలు, మౌలిక రంగం పురోగతి, నిబంధనల సరళీకరణ, తగిన ఆర్థిక సౌలభ్యత వంటి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. మందగమనంలో కేవలం 2.8 శాతం వృద్ధి సాధిస్తున్న ప్రపంచ వాణిజ్య విపణిలో భారత్ తన వాటాను కాపాడుకోవడంపైనే తక్షణం దృష్టి పెట్టాలన్నారు. 16 నెలలుగా భారత్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా... క్షీణత నెలకొన్న సంగతి తెలిసిందే. దిగుమతుల బిల్లు తగ్గడం తగిన కరెంట్ అకౌంట్‌లోటు కొనసాగడానికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వార్షిక ఎగుమతుల అవార్డులు ‘నిర్యాత్ శ్రీ’, ‘నిర్యాత్ బంధు’లను పలువురికి ప్రదానం చేశారు.