
కొండంతైనా లక్ష్యం..ఇలా సులభం
మీరు ఇస్తున్న పొదుపు చిట్కాలు బాగుంటున్నాయి. నేను ప్రయత్నించిన ఒక చిట్కా గురించిన విశేషాలు పంచుకోవాలనుకుంటున్నాను.
మీరు ఇస్తున్న పొదుపు చిట్కాలు బాగుంటున్నాయి. నేను ప్రయత్నించిన ఒక చిట్కా గురించిన విశేషాలు పంచుకోవాలనుకుంటున్నాను. మా ఊరిలో చంద్రారావనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అందరికీ తలలో నాలుకలాగా ఉంటాడు. తనకు ఒకసారి పొదుపు, జీవిత బీమా ప్రాధాన్యాల గురించి చెప్పాను. ఏటా కనీసం రూ.3,000 కడితే అధిక కవరేజీ ఉండే బీమా పాలసీ తీసుకోవచ్చని చెప్పాను. ఒకేసారి అంత పెద్ద మొత్తం కష్టమన్నాడు. దీంతో నెలకు రూ. 300 పొదుపు చేయగలవా అంటే .. ఓస్ ఈజీగా చేసేయొచ్చు అన్నాడు.
ఇక, రోజుకో తీరుగా సంపాదన ఉండే చంద్రరావు నెలకు రూ. 300 ఎలా దాచాలన్నదానికి నాకో ఆలోచన వచ్చింది. ఒక రూ.160 పెట్టి తాళం గల చిన్న డిబ్బీ కొన్నాను. నేను, నా భార్య మొదట రూ. 50 అందులో వేసి అతనికి ఇచ్చాము. రోజూ వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని డబ్బాలో వేయమని చెప్పాను. అంటే రూ. 500 వస్తే రూ. 50, రూ. 1000 వస్తే రూ. 100 ఇలా అన్నమాట. దీనితో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇటు పొదుపుతో పాటు అటు నెల తిరిగే సరికి అందులో జమయిన మొత్తాన్ని బట్టి చూస్తే నెలవారీగా తను ఎంత ఆర్జిస్తున్నదీ కూడా అతనికి కచ్చితమైన అంచనా కూడా వస్తుంది.
ఉదాహరణకు డిబ్బీలో రూ. 1,000 జమయితే అతని సంపాదన రూ.10,000 అన్నమాట. చంద్రరావు ఈ చిట్కాలను పాటిస్తుండటంతో అతనికి బ్యాంకులో ఖాతా కూడా తెరిపించాము. ప్రతీ నెలా పొదుపు మొత్తాన్ని అందులో జమచేస్తున్నాడు. అలాగే పాలసీ కూడా తీసుకుని ప్రీమియంలూ సులువుగా కట్టుకుంటున్నాడు. కాబట్టి చెప్పేదేమిటంటే .. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కొండలా కనిపించే భారీ లక్ష్యాన్నైనా చిన్న చిన్న అంగల్లో సులువుగా చేరుకోవచ్చు. ఆపైన భగవంతుడు మంచివారికి మంచే చేస్తాడు.
- అయ్యగారి పట్టాభిరామం
(రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు, కోల్ ఇండియా), వాడపల్లి, తూ.గో. జిల్లా