నా పోర్ట్‌ఫోలియోలో ఐదు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయింది. వీటి నుంచి పెట్టుబడులను రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు మళ్లించమంటారా? రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఇవి కూడా మంచి పనితీరును కనబరుస్తాయా?
-ఈశ్వర్, తిరుపతి
ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు లాకిన్ పీరియడ్ పూర్తయితే, అవి సాధారణ ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. ఇతర ఓపెన్-ఎండెడ్ ఫండ్స్‌లాగానే యాక్టివ్‌గా ట్రేడవుతాయి. క్లోజ్‌డ్ ఎండెడ్ ఫండ్స్ విషయానికొస్తే, ఒకేసారి డబ్బులు వస్తాయి. దీని నిర్వహణ నిమిత్తం ఈ ఫండ్ మేనేజర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు లభించవు. అందుకనే క్లోజ్‌డ్ ఎండెడ్ ఫండ్స్‌పై ఫండ్ మేనేజర్లకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌కు మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా నిమిత్తం ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి ఇవి ఆకర్షణీయంగానే ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌ల్లో ఏ ఫండ్ అయినా సరైన పనితీరు కనబరచకపోతే మెథాడికల్ వేలో ఈ ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు.
ఎస్‌బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ ఎలా ఉంటుంది? ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. అయినప్పటికీ పెట్టుబడులను కొనసాగించమంటారా?
-పావని, ఖమ్మం
డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఫ్లెక్సి డెట్ బాండ్స్‌గా వ్యవహరిస్తారు. భవిష్యత్ వడ్డీరేట్ల అవుట్‌లుక్ ఆధారంగా మెచ్యూర్ అయ్యే పేపర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లు అనుకోకుండా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో ఈ ఫండ్స్‌కు నష్టాలొచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ భావించిన తరుణంలో ఆర్‌బీఐ ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లను పెంచేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ కాలపరిమితి ఏడాదికి మించినట్లయితే, వీటిల్లోనే కొనసాగడం ఉత్తమం. జూన్‌లో వచ్చిన నష్టాలను ఇప్పటికే చాలా బాండ్ ఫండ్స్ రికవరీ చేసుకున్నాయి. చాలా బాండ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియో ప్రొఫైల్స్‌ను మార్చేశాయి కూడా. ఎస్‌బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌కు 2011 నుంచి 4/5 స్టార్ రేటింగ్ ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాతనే ఈ ఫండ్ రేటింగ్ 3 స్టార్‌కు తగ్గింది. ఈ ఫండ్ రేటింగ్, పనితీరు పడిపోవడం కొనసాగుతున్నట్లయితే, ఇదే కేటగిరిలోని మరో ఫండ్‌కు మారిపోవడం ఉత్తమం. ఒకటి లేదా రెండేళ్ల కాలానికి అధిక రిటర్న్‌లు కావాలనుకునే ఇన్వెస్టర్లు ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే గత 3-4 నెలల్లో ఈ ఫండ్స్ పనితీరు బాగాలేని విషయం వాస్తవమే. ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడే ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి.
నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. నా నెలసరి సంపాదన రూ.20,000. నేను ఇంతవరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. ఏదైనా ఉత్తమమైన టెర్మ్ పాలసీనొకదానిని సూచించండి?
- రవీందర్, కడప
బీమా అవసరాన్ని గుర్తించినందుకు అభినందనలు. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని బీమానే అందిస్తుంది.మీ ప్రస్తుత ఖర్చులు, మీ కుటుంబానికున్న ఆస్తులు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాలపై అధారపడి ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే విషయంలో ఎలాంటి నిర్దిష్ట నియమం లేదు. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించాలంటే,,, ముందుగా మీరు చెల్లించాల్సిన అప్పులు, రోజువారీ వ్యయాలు, పిల్లాడి చదువు ఖర్చు, తదితర అంశాలను లెక్కించండి. ఆ తర్వాత మీ ఆస్తులు, మీకు లభించే ఆదాయాన్ని గణించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అవసరమయ్యే మొత్తానికి మీ అప్పులను కూడి దాని నుంచి మీ ఆస్తులను తీసేయండి. అలా వచ్చేదే మీకు అవసరయ్యే బీమా మొత్తం. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
అవైవా ఐ-లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఈషీల్డ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్,... ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీలు. ఈ ఆన్‌లైన్ విధానం సౌకర్యంగా లేదని మీరు భావిస్తే, అవైవా లైఫ్‌షీల్డ్ ప్లాటినమ్ ప్రొటెక్షన్, ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్-లెవల్ టెర్మ్..ఈ ఆఫ్‌లైన్ పాలసీలను పరిశీలించవచ్చు. ఏజెంట్లు ఉండరు కాబట్టి ఆఫ్‌లైన్ పాలసీల కంటే ఆన్‌లైన్ పాలసీలు చౌకగా ఉంటాయి. ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత ఆయా పాలసీల ప్రీమియంలు ఎంత ఉన్నాయో పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపోయే పాలసీ తీసుకోండి.
ధీరేంద్ర కుమార్
సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్