Tax Saving Fund
-
పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా ప్రణాణళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా, ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా సాధనాల్లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారు ఈ తరుణంలో ఈక్విటీ పెట్టుబడులతోపాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఒకటి. మూడేళ్ల లాకిన్ ఉండే ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపులు సొంతం చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా 18.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గడిచిన ఆరు నెలల కాలంలో రాబడులు 14.51 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడి 17.30 శాతంగా ఉంది. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 19.21 శాతం, ఏడేళ్లలో ఏటా 18.55 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 500 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్)తో పోలిస్తే ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ పథకంలో రెండు శాతం అధిక రాబడులు ఉన్నాయి. ఈక్విటీ ఎల్ఎస్ఎస్ విభాగం కంటే కూడా ఇవే కాలాల్లో ఈ పథకమే మెరుగ్గా పనిచేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 20431 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎక్స్పెన్స్ రేషియో 1.58 శాతంగా ఉంది. 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తన నిర్వహణలోని ఆస్తుల్లో 98.35 శాతం ఈక్విటీలకు కేటాయించింది. మిగిలిన 1.65 శాతం నగదు నిల్వల రూపంలో ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 25 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 8.41 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్ద పీట వేసింది. 30.50 శాతం మేర పెట్టుబడులు ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. మొదటి నుంచి ఈ పథకం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సేవల రంగ కంపెనీలకు 10 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.57 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.40 శాతం చొప్పు పెట్టుబడుల్లో కేటాయింపులు చేసింది. -
జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి?
హెచ్డీఎఫ్సీ టాప్ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత రెండు నెలలుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమేనా ? ఈ ఫండ్ నుంచి వైదొలగి వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక కొనసాగమంటారా? - రూపాలి, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత 5-6 నెలల నుంచి క్షీణిస్తూ ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్‌ని బట్టి చూస్తే దీర్ఘకాలానికి ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చిందని చెప్పవచ్చు. గత 10-15 ఏళ్లలో మంంచి పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం సహజం. అయితే ఈ ఫండ్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేం భావిస్తున్నాం. ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ షేర్లు ఉన్నాయి. ఏడాది, అంతకుమించిన కాలానికి ఫండ్ పనితీరు బాగా లేకపోతే అప్పుడు ఈ ఫండ్ నుంచి వైదొలగే విషయాన్ని ఆలోచించవచ్చు. ఫండ్ పనితీరును ఎప్పటికప్పుడు గమనించడం మరచిపోకండి. నాకు నెలకు రూ.50,000 జీతం వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.35,000 వరకూ ఆదా చేయగలుగుతున్నాను. పన్ను ఆదా కోసం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ప్రతీ ఏడాది రూ.50,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాను. ఈ పాలసీ మరో 20 ఏళ్లు ఉంటుంది. ఇది కాక మరేవిధమైన ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఐదేళ్ల తర్వాత రూ.35 లక్షలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మిగిలే రూ.35,000కు మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మార్గాలను సూచించండి ? - రాజు, విశాఖపట్టణం ముందుగా మీరు చేయవలసింది మీ కోసం ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఆ తర్వాత జీవన్ ఆనంద్ పాలసీని ఆపేయండి. దీని వల్ల పన్ను ఆదా పెద్దగా ఉండదు. పైగా చెప్పుకోదగ్గ రాబడులు కూడా రావు. ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో నెలవారీ సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మిగిలిన మొత్తాన్ని ఏదైనా మంచి పనితీరు కనబరుస్తున్న గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నెలకు రూ.35,000 చొప్పున ఐదేళ్ల పాటు ఏడాదికి 18 శాతం రాబడి వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే మీరు కోరుకున్న మొత్తాన్ని పొందగలరు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత మొత్తాన్ని నా భార్యతో కలసి ఇన్వెస్ట్ చేశాను. ఇలా భార్య లేదా తండ్రి లేదా తల్లి లేదా ఎవరైనా బంధువుతో కలసి జాయింట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను నిబంధనలు ఎలా ఉంటాయి. ఇలా జాయింట్‌గా ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరూ పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - సుదర్శన్, నెల్లూర్ మ్యూచువల్ ఫండ్స్‌లో జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే, ప్రైమరీ హోల్డర్‌కే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పన్ను బాధ్యత కూడా ఆ ప్రైమరీ హోల్డర్‌కే ఉంటుంది. రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. రానున్న 5-8 ఏళ్ల వరకూ రిస్క్ తీసుకోగలను. 2010 నుంచి సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్‌కు 4-5 స్టార్ రేటింగ్ లేదు. ఈ ఫండ్స్ నుంచి వైదొలగమంటారా? - గంగాధర్, కరీంనగర్ సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్...ఈ రెండు ఫండ్స్ ఇప్పటికీ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెడితేనే మంచి రాబడులు వస్తాయి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసేవాళ్లు మార్కెట్లలో స్వల్పకాలిక ఒడిదుడుకులను పెద్దగా పట్టించుకోకూడదు. ఏ ఫండ్ రేటింగ్ అయినా 3 స్టార్స్ కంటే దిగువగా ఉంటేనే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పునరాలోచన చేయాలి. ప్రస్తుతమున్న ఫండ్స్ నుంచి వేరే ఫండ్స్‌కు మారాలనుకుంటే, పన్ను సంబంధిత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
రిటైర్మెంట్ దృష్ట్యా ఈక్విటీ పెట్టుబడులు తగ్గించాలా?
నేను 2007 సంవత్సరంలో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో రూ.20,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పటివరకూ డివిడెండ్‌గా రూ. 11,600 వచ్చాయి. ఈ ఫండ్‌లోనే కొనసాగమంటారా? లేక ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? - సౌదామిని, విశాఖ పట్టణం రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ ఫండ్. అన్ని ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీకు అత్యవసరం అయినప్పుడు ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోలేకపోవడం ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఉండే ఒక ప్రధానమైన లోపం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్కు కూడా ఇదే(మూడేళ్ల) లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. ఒక్కో డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఇన్వెస్ట్ చేసిన కాలం నుంచి మూడేళ్ల కాలాన్ని లాకిన్ పీరియ డ్గా పరిగణిస్తారు. మీ చివరి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసి మూడేళ్లైన తర్వాతనే మీరు మీ సొమ్ములను వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకుంటే.. మీ ప్లాన్‌ను డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ నుంచి డివిడెండ్ పేఅవుట్కు మార్చుకోండి. ఈ ప్లాన్‌లో మీకు డివిడెండ్లు క్రమానుగతంగా అందుతాయి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మిగిలిన సొమ్ములను పొందవచ్చు. నాకు ఇటీవలనే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఇప్పుడు నేను నెలకు రూ. 15,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. యులిప్‌ల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా లేక మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? తగిన సలహా ఇవ్వగలరు. - బాబ్జి, కరీంనగర్ ముందుగా మీ ఇద్దరి జీతాలకు సంబంధించి ఆర్నెల్ల మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోండి. ఈ నిధి సమకూరిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఇన్వెస్ట్‌మెంట్‌కు గానీ, బీమా అవసరాలకు గానీ యూలిప్‌లు అనువైనవి కావు. పైగా యులిప్‌ల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. యులిప్‌లు మొదటి 5-6 సంవత్సరాల్లో కనీసం 5-6 శాతం మొత్తాన్ని వ్యయాల కింద తీసేసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఈ వ్యయాల శాతం 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకే ఉంటాయి. అంతే గాక పనితీరు బాగా లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోవచ్చు. యులిప్‌ల్లో అలా ఉండదు. పనితీరు బాగా ఉన్నా, బాగోలేకపోయినా యులిప్‌ల్లో కనీస లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పారదర్శకంగా ఉంటాయి. యులిప్‌లు దీనికి భిన్నం. మీ ఆర్థిక అవసరాలు, బడ్జెట్, భరించగలిగే రిస్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంచి రేటింగ్, పనితీరు ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. నా మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతం వరకూ ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఉన్నాయి. మిగిలినవి ఈక్విటీల్లో ఉన్నాయి. నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో వీటిని ఇన్వెస్ట్ చేశాను. వీటిల్లో నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం విలువ రూ.30 లక్షల వరకూ ఉంటుంది. నేను త్వరలో రిటైర్ కాబోతున్నాను. ఈ దృష్ట్యా ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లోకి మారుద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - ఇంతియాజ్, హైదరాబాద్ రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈక్విటీకి స్వల్పభాగమే కేటాయించాలన్న భావనతో మీరు ప్రశ్న అడిగినట్లున్నారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ, రాబడులు కూడా బాగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే రిటైర్మెంట్ తర్వాతనే మీకు అధికంగా రాబడులు అవసరం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ఇవ్వలేవు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని దీటుగా తట్టుకునే రాబడులను పొందవచ్చు. అందుకని ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలన్న మీ ఆలోచన సరైనది కాదు. వాటిని కొనసాగించండి. -
జీవిత బీమా ఎంత కు తీసుకోవాలి?
నా పోర్ట్‌ఫోలియోలో ఐదు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయింది. వీటి నుంచి పెట్టుబడులను రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు మళ్లించమంటారా? రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఇవి కూడా మంచి పనితీరును కనబరుస్తాయా? -ఈశ్వర్, తిరుపతి ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు లాకిన్ పీరియడ్ పూర్తయితే, అవి సాధారణ ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. ఇతర ఓపెన్-ఎండెడ్ ఫండ్స్‌లాగానే యాక్టివ్‌గా ట్రేడవుతాయి. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ విషయానికొస్తే, ఒకేసారి డబ్బులు వస్తాయి. దీని నిర్వహణ నిమిత్తం ఈ ఫండ్ మేనేజర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు లభించవు. అందుకనే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌పై ఫండ్ మేనేజర్లకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌కు మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా నిమిత్తం ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి ఇవి ఆకర్షణీయంగానే ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌ల్లో ఏ ఫండ్ అయినా సరైన పనితీరు కనబరచకపోతే మెథాడికల్ వేలో ఈ ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ ఎలా ఉంటుంది? ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. అయినప్పటికీ పెట్టుబడులను కొనసాగించమంటారా? -పావని, ఖమ్మం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఫ్లెక్సి డెట్ బాండ్స్‌గా వ్యవహరిస్తారు. భవిష్యత్ వడ్డీరేట్ల అవుట్‌లుక్ ఆధారంగా మెచ్యూర్ అయ్యే పేపర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లు అనుకోకుండా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో ఈ ఫండ్స్‌కు నష్టాలొచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ భావించిన తరుణంలో ఆర్బీఐ ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లను పెంచేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ కాలపరిమితి ఏడాదికి మించినట్లయితే, వీటిల్లోనే కొనసాగడం ఉత్తమం. జూన్‌లో వచ్చిన నష్టాలను ఇప్పటికే చాలా బాండ్ ఫండ్స్ రికవరీ చేసుకున్నాయి. చాలా బాండ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియో ప్రొఫైల్స్‌ను మార్చేశాయి కూడా. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌కు 2011 నుంచి 4/5 స్టార్ రేటింగ్ ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాతనే ఈ ఫండ్ రేటింగ్ 3 స్టార్‌కు తగ్గింది. ఈ ఫండ్ రేటింగ్, పనితీరు పడిపోవడం కొనసాగుతున్నట్లయితే, ఇదే కేటగిరిలోని మరో ఫండ్‌కు మారిపోవడం ఉత్తమం. ఒకటి లేదా రెండేళ్ల కాలానికి అధిక రిటర్న్‌లు కావాలనుకునే ఇన్వెస్టర్లు ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే గత 3-4 నెలల్లో ఈ ఫండ్స్ పనితీరు బాగాలేని విషయం వాస్తవమే. ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడే ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. నా నెలసరి సంపాదన రూ.20,000. నేను ఇంతవరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. ఏదైనా ఉత్తమమైన టెర్మ్ పాలసీనొకదానిని సూచించండి? - రవీందర్, కడప బీమా అవసరాన్ని గుర్తించినందుకు అభినందనలు. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని బీమానే అందిస్తుంది.మీ ప్రస్తుత ఖర్చులు, మీ కుటుంబానికున్న ఆస్తులు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాలపై అధారపడి ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే విషయంలో ఎలాంటి నిర్దిష్ట నియమం లేదు. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించాలంటే,,, ముందుగా మీరు చెల్లించాల్సిన అప్పులు, రోజువారీ వ్యయాలు, పిల్లాడి చదువు ఖర్చు, తదితర అంశాలను లెక్కించండి. ఆ తర్వాత మీ ఆస్తులు, మీకు లభించే ఆదాయాన్ని గణించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అవసరమయ్యే మొత్తానికి మీ అప్పులను కూడి దాని నుంచి మీ ఆస్తులను తీసేయండి. అలా వచ్చేదే మీకు అవసరయ్యే బీమా మొత్తం. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈషీల్డ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్,... ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్లైన్ జీవిత బీమా పాలసీలు. ఈ ఆన్లైన్ విధానం సౌకర్యంగా లేదని మీరు భావిస్తే, అవైవా లైఫ్షీల్డ్ ప్లాటినమ్ ప్రొటెక్షన్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్-లెవల్ టెర్మ్..ఈ ఆఫ్‌లైన్ పాలసీలను పరిశీలించవచ్చు. ఏజెంట్లు ఉండరు కాబట్టి ఆఫ్‌లైన్ పాలసీల కంటే ఆన్లైన్ పాలసీలు చౌకగా ఉంటాయి. ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత ఆయా పాలసీల ప్రీమియంలు ఎంత ఉన్నాయో పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపోయే పాలసీ తీసుకోండి. ధీరేంద్ర కుమార్ సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్