జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి? | If the tax liability of the joint investment and to whom? | Sakshi
Sakshi News home page

జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి?

Published Mon, Jul 6 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి?

జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి?

హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత రెండు నెలలుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమేనా ? ఈ ఫండ్ నుంచి వైదొలగి వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక కొనసాగమంటారా?
 - రూపాలి, హైదరాబాద్

 హెచ్‌డీఎఫ్‌సీ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత 5-6 నెలల నుంచి క్షీణిస్తూ ఉన్న మాట వాస్తవమే.  అయితే ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్‌ని బట్టి చూస్తే దీర్ఘకాలానికి ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చిందని చెప్పవచ్చు. గత 10-15 ఏళ్లలో మంంచి పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం సహజం. అయితే ఈ ఫండ్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేం భావిస్తున్నాం. ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ షేర్లు ఉన్నాయి. ఏడాది, అంతకుమించిన కాలానికి ఫండ్ పనితీరు బాగా లేకపోతే అప్పుడు ఈ ఫండ్ నుంచి వైదొలగే విషయాన్ని ఆలోచించవచ్చు. ఫండ్ పనితీరును ఎప్పటికప్పుడు గమనించడం మరచిపోకండి.

 నాకు నెలకు రూ.50,000 జీతం వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.35,000 వరకూ ఆదా చేయగలుగుతున్నాను. పన్ను ఆదా కోసం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ప్రతీ ఏడాది రూ.50,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాను. ఈ పాలసీ మరో 20 ఏళ్లు ఉంటుంది. ఇది కాక మరేవిధమైన ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు. ఐదేళ్ల తర్వాత రూ.35 లక్షలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మిగిలే రూ.35,000కు మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను సూచించండి ?                - రాజు, విశాఖపట్టణం

 ముందుగా మీరు చేయవలసింది మీ కోసం ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఆ తర్వాత జీవన్ ఆనంద్ పాలసీని ఆపేయండి. దీని వల్ల పన్ను ఆదా పెద్దగా ఉండదు. పైగా చెప్పుకోదగ్గ రాబడులు కూడా రావు. ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో నెలవారీ సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మిగిలిన మొత్తాన్ని ఏదైనా మంచి పనితీరు కనబరుస్తున్న గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నెలకు రూ.35,000 చొప్పున ఐదేళ్ల పాటు ఏడాదికి 18 శాతం రాబడి వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే మీరు కోరుకున్న మొత్తాన్ని పొందగలరు.

 నేను మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత మొత్తాన్ని నా భార్యతో కలసి ఇన్వెస్ట్ చేశాను. ఇలా భార్య లేదా తండ్రి లేదా తల్లి లేదా ఎవరైనా బంధువుతో కలసి జాయింట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను నిబంధనలు ఎలా ఉంటాయి. ఇలా జాయింట్‌గా ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరూ పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 - సుదర్శన్, నెల్లూర్

 మ్యూచువల్ ఫండ్స్‌లో జాయింట్‌గా ఇన్వెస్ట్ చేస్తే, ప్రైమరీ హోల్డర్‌కే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పన్ను బాధ్యత కూడా ఆ ప్రైమరీ హోల్డర్‌కే ఉంటుంది.

 రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. రానున్న 5-8 ఏళ్ల వరకూ రిస్క్ తీసుకోగలను. 2010 నుంచి సుందరం సెలెక్ట్ మిడ్  క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్‌కు 4-5 స్టార్ రేటింగ్ లేదు. ఈ ఫండ్స్ నుంచి వైదొలగమంటారా?
 - గంగాధర్, కరీంనగర్

 సుందరం సెలెక్ట్ మిడ్  క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్...ఈ రెండు ఫండ్స్ ఇప్పటికీ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెడితేనే మంచి రాబడులు వస్తాయి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసేవాళ్లు మార్కెట్లలో స్వల్పకాలిక ఒడిదుడుకులను పెద్దగా పట్టించుకోకూడదు. ఏ ఫండ్ రేటింగ్ అయినా 3 స్టార్స్ కంటే దిగువగా ఉంటేనే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పునరాలోచన చేయాలి. ప్రస్తుతమున్న ఫండ్స్ నుంచి వేరే ఫండ్స్‌కు మారాలనుకుంటే, పన్ను సంబంధిత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement