పోర్ట్‌ఫోలియో ఒకటే.. రేటింగ్‌లు వేరు? | Ratings separated by the same portfolio | Sakshi
Sakshi News home page

పోర్ట్‌ఫోలియో ఒకటే.. రేటింగ్‌లు వేరు?

Published Mon, Dec 22 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

పోర్ట్‌ఫోలియో ఒకటే.. రేటింగ్‌లు వేరు?

పోర్ట్‌ఫోలియో ఒకటే.. రేటింగ్‌లు వేరు?

నేను గత ఏడాది సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్‌లో గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఏడాది జూన్ 27న ఇది హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్ ఫండ్‌లో విలీనమైంది. విలీనమయ్యే రోజున గ్రోత్ ప్లాన్‌లో రూ.25,000, డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో రూ.4,500 చొప్పున లాభాల్లో ఉన్నాను. నేను ఈ ఫండ్స్‌లోనే కొనసాగుతున్నాను. ఈ ఫండ్స్ విలీనం కారణంగా నేనేమైనా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) చెల్లించాలా? నా ఇన్వెస్ట్‌మెంట్ డేట్‌ను విలీనమైన తేదీనుంచి పరిగణిస్తారని అనుకుంటున్నాను. నేను ఆర్జించిన ఈ రూ. 25,000, రూ. 4,500పై నా పన్ను బాధ్యత ఎలా ఉంటుంది?
 - పావని, వైజాగ్

ఫండ్‌ల విలీనమంటే ఒక ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరొక ఫండ్‌లోకి బదిలీ చేయడం. దీనిని ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరొక ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌చేయడంగా భావిస్తారు. అంటే ఒక ఫండ్ యూనిట్స్‌ను అమ్మేసి, మరొక ఫండ్ యూనిట్స్‌ను కొనుగోలు చేయడంగా చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఫండ్స్ విలీనమైతే ఈ విషయాన్ని ఫండ్ హౌజ్‌లే చూసుకుంటాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై  దీర్ఘకాల, స్వల్పకాల మూలధన  లాభాల పన్నులు మాత్రం ఇన్వెస్టరే చెల్లించాల్సి ఉంటుంది.

డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లను మించి మీరు కొనసాగిస్తే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20%(ఇండెక్సేషన్ తర్వాత) చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల కంటే తక్కువ కాలమే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. డెట్‌ఫండ్స్‌లో మీరు స్వల్పకాల మూల ధన లాభాలు గడిస్తే ఆ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను లెక్కిస్తారు. ఇక మీ విషయానికొస్తే, ఇన్వెస్ట్‌మెంట్స్ కాలం ఏడాది కంటే తక్కువే ఉన్నందున మీరు గ్రోత్ ప్లాన్‌లో ఆర్జిం చిన రూ.25,000పై, డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆర్జించిన రూ.4,500లపై స్వల్పకాల మూలధనలాభాల పన్ను చెల్లించాలి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) చెల్లించాల్సిన పనిలేదు.

నేను ఈ ఏడాది జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్-క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో సిప్ విధానంలో 12 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాను. వచ్చే ఏడాది జూన్‌లో వీటిని నేను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా?  అలాచేస్తే నాకు జూన్, 2015 నాటి ఎన్‌ఏవీ వర్తిస్తుందా?  డిసెంబర్, 2015 నాటి ఎన్‌ఏవీ  వర్తిస్తుందా?      
- శ్రీనివాస్, సూర్యాపేట

మీరు ఏ రోజున మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటారో, ఏ రోజున ఉన్న ఎన్‌ఏవీనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ తుది విలువగా పరిగణిస్తారు. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2015 జూన్ 1న ఉపసంహరించుకుంటే, ఆ రోజు ఎన్‌ఏవీ,  2015 డిసెంబర్ 1న ఉపసంహరించుకుంటే ఆ రోజు ఎన్‌ఏవీ  వర్తిస్తుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలం కొనసాగిస్తే మంచిది. ఈక్విటీ మ్యూచువల్  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అందుకని మీకు సొమ్ము అత్యంత అవసరం అయితేనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోండి. లేదంటే మరికొంత కాలం కనీసం మూడు సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిస్తే, మరిన్ని ప్రయోజనాలు పొందగలరు.

ఒకే రకం మ్యూచువల్ ఫండ్ల రేటింగ్‌లు రెగ్యులర్ ప్లాన్‌కు ఒక రకంగా, డెరైక్ట్ ప్లాన్‌కు మరొకరకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ మ్యాగ్నమ్ గిల్ట్-లాంగ్‌టర్మ్, యూటీఐ గిల్ట్ అడ్వాండేజ్-లాంగ్‌టర్మ్ ఈ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్‌ల రేటింగ్‌లు, డెరైక్ట్ ప్లాన్‌ల రేటింగ్‌లు విభిన్నంగా ఉన్నాయి. ఈ రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్‌ల పోర్ట్‌ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, రేటింగ్‌లు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?
- పర్వేజ్, హైదరాబాద్

ఒకే మ్యూచువల్ ఫండ్‌ల రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్‌ల రేటింగ్‌లు భిన్నంగా ఉండడం సహజమే. వాటి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, వాటి రేటింగ్‌ల్లో తేడాలు ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్స్ వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఫండ్‌ల పనితీరుపై వ్యయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతాయి. అందుకని రెగ్యులర్  ప్లాన్‌ల రేటింగ్స్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్‌ల రేటింగ్స్ వాటితో సమానంగా కానీ, ఒక్కోక్కప్పుడు వాటి కంటే ఉత్తమంగా గానీ ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement